3 Burnt Alive: హాసిని అంటే చాలా ప్రేమ.. డాడీ లేడన్న విషయం ఎలా చెప్పాలో

19 May, 2022 08:44 IST|Sakshi

విషాదం నింపిన రోడ్డు ప్రమాదం 

తిరిగిరాని లోకాలకు ముగ్గురు మిత్రులు 

కారులోనే సజీవ దహనం 

ఆనవాళ్లను గుర్తించిన కుటుంబ సభ్యులు 

ఆసుపత్రిలో మిన్నంటిన రోదనలు 

ఆశలు సజీవ దహనమయ్యాయి. కంటి దీపాలు కొడిగట్టాయి.. ఎదిగి వచ్చిన పిల్లలు ఇక లేరనే నిజాన్ని ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.. ఆసుపత్రి ఆవరణ కన్నీటి సంద్రమైంది.. ఆనవాళ్లు తప్ప కడచూపునకూ నోచుకోని దయనీయ ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.. జీవితంలో బాగా స్థిరపడాలనే లక్ష్యాన్ని విధి కాలరాసినా.. ఆ స్నేహాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. 
– మార్కాపురం/భాకరాపేట

చిత్తూరు జిల్లా భాకరపేట సమీపంలోని చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన రావూరి తేజ(29), సాకిరి బాలాజీ(21), పటాన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌(23) ముగ్గురు స్నేహితులు. ఈ నెల 16న తమ స్నేహితుడైన నరేంద్ర కారును తీసుకుని తేజ గుంటూరు జిల్లా దాచేపల్లిలో టెలికం శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్‌ఖాన్‌ దగ్గరకు వచ్చాడు. అతడిని కారులో ఎక్కించుకుని కడపకు వెళ్లాడు. అక్కడికి మరో స్నేహితుడు తిరుపతికి చెందిన బాలాజీ చేరుకున్నాడు. ముగ్గురూ కలిసి 17వ తేదీ ఉదయం కడప నుంచి శ్రీశైలానికి బయలుదేరారు. అదేరోజు సాయంత్రం మార్కాపురం మండలం జంగంగుంట్ల–తిప్పాయపాలెం గ్రామాల మధ్య కారు టైరు పంక్చర్‌ కావడంతో ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీని ఢీకొంది. కారు పెట్రోల్‌ ట్యాంక్‌కు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. డోర్లు తెరుచుకోకపోవడం, మంటలు ఎక్కువ కావడంతో కారులోనే ముగ్గురూ సజీవ దహనమయ్యారు. 

మృతదేహాల గుర్తింపు ఇలా..  
కారులో ఉన్న ముగ్గురు సజీవ దహనం కావడం, సమాచారం లేకపోవడంతో కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు కారు యజమానికి ఫోన్‌ చేశారు. ముందుగా డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్న తేజ వివరాలు సేకరించారు. తిరుపతి జిల్లా బాకరాపేట వాసిగా గుర్తించి వారి కుటుంబ సభ్యుల సాయంతో మిగిలిన ఇద్దరి వివరాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రులు వచ్చి డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తిని తేజగా, పక్కనే చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా ఇమ్రాన్‌ఖాన్, వెనుక సీటులో ఉన్న వ్యక్తిని బాలాజీగా గుర్తించారు. మృతదేహాలకు డీఎన్‌ఏ టెస్టు చేయనున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ సుమన్‌ తెలిపారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. కాగా మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో మార్కాపురం జిల్లా వైద్యశాల మార్మోగింది. 

చదవండి: (Hyderabad: స్టేజీపై నుంచి పడి ఇంటెలిజెన్స్‌ ఏడీ దుర్మరణం) 

భాకరాపేటలో విషాద ఛాయలు 
ముగ్గరు స్నేహితులు కారు ప్రమాదంలో సజీవ దహనమైన ఘటనతో భాకరాపేటలో విషాదం అలుముకుంది. మంగళవారం రాత్రికే మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు భారీగా మార్కాపురం చేరుకున్నారు. బుధవారం ఉదయం మృతదేహాలను గుర్తించే విషయంలో ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కింది. ఆసుపత్రి ఆవరణ కన్నీటి సంద్రమైంది. మధ్యాహ్నం పైన పోస్టుమార్టం పూర్తి కాగా.. అర్ధరాత్రికి మృతదేహాలను భాకరపేటకు తరలించారు.  

రెండు వారాల్లో కువైట్‌ వెళ్లేవాడు  
‘నా కుమారుడు తేజ కువైట్‌కు వెళ్లేందుకు పాస్‌పోర్టు, వీసా సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీశైలంతోపాటు కనకదుర్గమ్మను దర్శించుకుని కువైట్‌ వెళ్దామని భావించి స్నేహితులతో కలిసి కారులో బయలుదేరాడు. సాయంత్రం 5.30–6 గంటల మధ్య ఫోన్‌ ద్వారా సమాచారం అందడంతో నమ్మలేకపోయా. తనకు కుమార్తె హాసిని అంటే చాలా ప్రేమ, నిన్న కూడా మాట్లాడాడు. డాడీ లేడు అన్న విషయాన్ని ఎలా చెప్పాలో అర్థంకావడం లేదు’ అంటూ తల్లిదండ్రులు వసంత, భాస్కర్‌ బోరున విలపించారు. భాకరాపేటలోని బీసీ కాలనీలో తేజ కుటుంబం నివాసం ఉంటోంది. భాస్కర్‌ పెయింటర్‌గా పనిచేస్తూ కుమారుడిని బెంగళూరులో ఇంజినీరింగ్‌ చదివించారు.

టూర్‌ అంటే పంపించేదాన్ని కాదు   
‘నా కొడుకు బాలాజీ బెంగళూరులో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేశాడు. వచ్చే నెలలో ఉద్యోగంలో జాయిన్‌ కావాల్సి ఉంది. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తున్నానని చెప్పాడే కానీ టూర్‌ అని చెప్పలేదు. అలా అయితే పంపెదాన్నే కాదు’ అంటూ తల్లి ఇందిర, తండ్రి సత్యనారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. టీటీడీ ఉద్యోగస్తులైన ఈ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు బాలాజీ కాగా రెండో కుమారుడి పేరు కూడా బాలాజీనే. కుమారుడి మరణ వార్తను తట్టుకోలేకపోతున్నారు. ఉద్యోగ రీత్యా తిరుపతిలో ఉంటున్నారు.

ఇలా జరుగుతుందనుకోలేదు.. 
‘నా కుమారుడు ఇమ్రాన్‌ఖాన్‌ డిప్లొమో చదివి గుంటూరు జిల్లా దాచేపల్లి టెలికం శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురూ మంచి స్నేహితులు. అర్ధంతరంగా చనిపోయారంటే నమ్మలేకపోతున్నాన’ని తండ్రి మస్తాన్‌ఖాన్‌ విలపిస్తూ చెప్పారు. ఒక్కడే కుమారుడు కావడంతో మరణ వార్తను తల్లి నజీరా, ఇద్దరు అక్కలు తట్టుకోలేకపోతున్నారు. భాకరాపేటలోని తలకోన రోడ్డులో ఇమ్రాన్‌ కుటుంబం నివాసం ఉంటోంది. 

మరిన్ని వార్తలు