పర్యాటకుల ‘రివెంజ్‌ టూరిజం’ 

25 Jul, 2022 04:01 IST|Sakshi

కోవిడ్‌ అనిశ్చితిలో సుదీర్ఘ విరామం తర్వాత పెరుగుతున్న ప్రయాణాలు 

ప్రశాంత వాతావరణంలోనే గడిపేందుకు పర్యాటకుల ఆసక్తి 

ఏజెంట్ల గైడెన్స్‌లోనే టూర్లకు సిద్ధం..ఖర్చుకు వెనుకాడని వైనం

సాక్షి, అమరావతి: పర్యాటక రంగంలో కొత్త ప్రయాణ ఒరవడులు కనిపిస్తున్నాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో విధించిన నిబంధనలు, పరిమితుల సడలింపులతో ప్రయాణాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఎక్కువ మంది విదేశీ టూర్ల వైపు చూస్తుంటే..వీలుపడని వారు దేశీయ పర్యటనలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ట్రావెల్‌ పరిశ్రమలో సుదీర్ఘ విరామం తర్వాత ఇంతటి స్థాయిలో ప్రయాణాల పెరుగుదలను మార్కెట్‌ నిపుణులు ‘రివెంజ్‌ ట్రావెల్‌’గా అభివర్ణిస్తున్నారు.  

పక్కా గైడెన్స్‌తో.. 
కోవిడ్‌ వల్ల ఎదురైన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి సరైన గైడెన్స్‌లోనే తమ ప్రయాణాలు కొనసాగించాలని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా ట్రావెల్‌ ఏజెంట్ల సాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తుండటం ట్రావెల్‌ కంపెనీలకు ఊతం ఇస్తోంది. ఈ క్రమంలోనే 80 శాతం మంది టూర్‌ ఆపరేటర్లు, ట్రావెల్‌ ఏజెంట్లు ద్వారా ఆర్గనైజ్డ్‌ ట్రిప్‌లు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినియోగదారుల మద్దతు సమకూర్చుకునేందుకు అనేక కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.  

రేటు ఎంతైనా పర్వాలేదు
ప్రముఖ ట్రావెల్‌ సర్వే ప్రకారం భారత్‌లో 86 శాతం మంది కరోనాకు మందుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేసైనా తాము కోల్పోయిన ప్రయాణ అనుభూతిని తిరిగి పొందాలనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తున్న మెజార్టీ ఎయిర్‌లైన్స్, ట్రావెల్‌ ఏజెంట్లు భవిష్యత్తులో తమ పరిశ్రమ భారీ వృద్ధిని నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

ప్రకృతి విహారం కోసం.. 
పర్యావరణ అనుకూల పర్యటనల వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. 87 శాతం మంది తాము ప్రశాంత వాతావరణంలో గడపాలని కోరుకుంటున్నారు. కార్పొరేట్‌ ప్రయాణికులు సైతం సహోద్యోగులతో మళ్లీ కలిసి ప్రయాణాల్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తేలింది. 

ఏమిటీ రివెంజ్‌ ట్రావెల్‌ 
నిబంధనల నుంచి ఉపశమనం కోసం ప్రజలు జాగ్రత్తలు విస్మరించి కరోనాను మళ్లీ విజృంభించేలా చేసే ప్రక్రియను రివెంజ్‌ ట్రావెల్‌ లేదా రివెంజ్‌ టూరిజం అంటారు. లాక్‌డౌన్‌లు, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ల కారణంగా ఇంట్లోనే ఉండి విసిగిపోయిన ప్రజలు సాధారణంగా సాగుతున్న జీవితంలో మార్పు కోరుకొని బయటికి వస్తున్నారు. కరోనా భయం కూడా వారిని ఆపలేకపోతోంది. అందుకే వారు టూర్‌లకు వెళుతున్నారు. ఇదే రివెంజ్‌ ట్రావెల్‌ పూర్తి కాన్సెప్ట్‌. పర్యాటకులు నిబంధనలను విస్మరించడాన్ని చూసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ‘‘రివెంజ్‌ ట్రావెల్‌’’అన్న పదాన్ని ఇటీవల వాడింది. ఇది చాలా ప్రమాదకరమని ప్రజలను హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు