కరోనా: పెళ్లిళ్లు చేసుకోవచ్చు.. కానీ!

6 May, 2021 10:48 IST|Sakshi

వివాహానికి 20 మందికే అనుమతి

144 సెక్షన్‌ను అతిక్రమిస్తే కేసుల నమోదు

అత్యవసర రంగాలకు మినహాయింపు

టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ జె.నివాస్‌

సాక్షి, శ్రీకాకుళం:  కోవిడ్‌ నిబంధనల ప్రకారం వేడుకలు, వివాహాలు చేసుకోవాలంటే కేవలం 20 మందితో మాత్రమే జరుపుకోవాలని, అంతకంటే ఎక్కువ మంది ఉండడానికి వీల్లేదని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు, వైద్య అధికారులతో బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వేడుకలు జరిగే స్థలాలను తహసీల్దార్‌ తనిఖీ చేస్తారని తెలిపారు. కరోనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, హొటల్స్, రెస్టారెంట్లు తెరవాలని, 12 గంటల తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు.

144 సెక్షన్‌ అమలులో ఉందని, ఎక్కడా నలుగురు కంటే ఎక్కువ మంది ఉండకూదని తెలిపారు. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాతో పాటు మరికొన్ని రంగాలకు మినహాయింపులు ఉన్నాయని తెలిపారు. వ్యవసా య పనులు, పంటల సేకరణకు కూడా మినహాయింపు ఉందన్నారు. జనం ఈ కర్ఫ్యూకు సహకరిస్తే కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టే అవ కాశం ఉందన్నారు. రెండు వారాల తర్వాత జిల్లాలో ఒక్క కేసు కూడా ఉండకుండా అధికారులు కృషి చేయాలని కోరారు. ఇష్టానుసారంగా తిరిగేవారిని అరెస్టు చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ డాక్టర్‌ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు ఉన్నారు.  

 అత్యవసరమైతే..
ప్రభుత్వ అనుమతి సర్వీసులు, అత్యవసర సేవలకు కర్ఫ్యూ సమయంలో మినహాయింపు కోసం పోలీసు హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 94944 66406ను వినియోగించుకోవాలని ఎస్పీ అమిత్‌ బర్దార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్‌ డీఎస్పీ సీహెచ్‌జీవీ ప్రసాదరావును నోడల్‌ అధికారిగా నియమించినట్లు తెలిపారు.     

అనంతపురం: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో బుధవారం నుంచి 18వ తేదీ వరకు కర్ఫ్యూ అమలు చేస్తునట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. వివాహ వేడుకలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని, వేడుకకు హాజరయ్యే వారి పేర్లను తహసీల్దారకు సమర్పించాలన్నారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాలను తహసీల్దార్లు తనిఖీ చేసి నిబంధనలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తారన్నారు. ఇక ఉదయం 6 నుంచి 12 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్‌ అవుతుందన్నారు. అంతర్‌ రాష్ట్ర, జిల్లా లోపల, వెలుపల వాహనాలు తిరగరాదన్నారు. అత్యవసర వైద్యసేవలు లేదా ఇతరాత్ర అత్యవసరాలకు మినహాయింపు ఉంటుందన్నారు. రైలు రవాణా వ్యవస్థ ద్వారా వచ్చే ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్‌ వద్ద అటోలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయన్నారు.

చదవండి: 
స్టాలిన్‌కు శుభాకాంక్షలు  తెలిపిన ఎంపీ మాగుంట
కరోనాను జయించిన 92 ఏళ్ల బామ్మ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు