నిర్మల ఆత్మహత్య చేసుకుందా.. లేక హత్య చేశారా?

5 Jun, 2022 13:29 IST|Sakshi

విజయనగరం క్రైమ్‌ : అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, వన్‌టౌన్‌ పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మయూరి జంక్షన్‌కు చెందిన నిర్మలకు (27) 2020లో స్థానిక బాలాజీ రోడ్డు నటరాజ్‌ కాలనీకి చెందిన భార్గవ్‌తో వివాహం జరిగింది.

ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అయినప్పటికీ... కరోనా నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే పెళ్లయినప్పటి నుంచి భర్త భార్గవ్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం నిర్మలను వేధించేవారు. దీంతో ఆమె పలుమార్లు కన్నవారింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద గోడు వెల్లబోసుకుంది. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో నిర్మలను ఆమె తల్లిదండ్రులు సర్ది చెప్పి అత్తవారింటికి పంపించేవారు.

కొద్ది రోజులుగా గొడవలు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిర్మల శనివారం ఇంటిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే నిర్మల ఆత్మహత్య చేసుకుందా.. లేక అత్తింటి వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద  కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై దుర్గాప్రసాద్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు