Ananthapur Woman Suicide: అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా సిద్ధం..

24 Jul, 2022 16:00 IST|Sakshi

కులాలు వేరైనా ప్రేమ చిగురించింది.. చదువు, అంతస్తు అడ్డుగా నిలిచినా ఆమె ఎదిరించింది.. ఇద్దరూ ఒక్కటయ్యారు.. ఇద్దరికి జన్మనిచ్చారు.. ఐదేళ్ల కాపురం..అద్దమంటి పిల్లలు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అనుమానం పెనుభూతమైంది! దంపతుల మధ్య దూరం పెంచింది.. అతని నిర్లక్ష్యాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.. నింద మోయలేక మదనపడింది.. కన్నవాళ్లకు చెప్పుకోలేక.. కట్టుకున్నోడితో కలసి ఉండే ‘భాగ్య’ం లేక.. అందనంత తీరాలకు వెళ్లిపోయింది!పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలనూ వెంట తీసుకుపోయింది! 

పుట్టపర్తి అర్బన్‌:  పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో శనివారం కురుబ భాగ్యశ్రీ(27) తన ఇద్దరు పిల్లలు జతమన్‌ శౌర్య(4), క్రిషిత (2)లను గొంతు నులిమి చంపి.. తనూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అయ్యో.. ఎంత పని చేశావు తల్లీ అంటూ గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన కురుబ భాగ్యశ్రీ అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివింది. కుటుంబం అనంతపురంలో స్థిరపడగా.. బతుకుదెరువు కోసం భాగ్యశ్రీ తల్లిదండ్రులు ధాబా నడిపేవారు. పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన మారెన్న కుమారుడు చరణ్‌కుమార్‌ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతను తరచూ ఆ ధాబాకు వెళ్తూ భాగ్యశ్రీని ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని నమ్మి వెంట నడిచింది. ఐదేళ్ల క్రితం ఇద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. బత్తలపల్లిలో వేరు కాపురం పెట్టారు. భార్యాభర్త అన్యోన్యంగా ఉండేవారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా జతమన్‌ శౌర్య(లడ్డు), క్రిషిత (లక్కీ) జని్మంచారు. రెండేళ్లుగా చరణ్‌ ‘కియా’ కంపెనీ బస్సు డ్రైవర్‌గా వెళ్తున్నాడు. ఏమైందో తెలియదు గానీ దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. భర్త నిర్లక్ష్యం చేయడంతో భాగ్యశ్రీ తట్టుకోలేక పోయింది. పుట్టింటి వారు ఎప్పుడో ముఖం చాటేయగా, తన బాధ ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. భర్త అనుమానంతో తనపై నిందలు మోపడాన్ని సహించలేకపోయింది.  

పోరాడి ఓడిన భాగ్యశ్రీ.. 
ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం ఇలా అయిపోయిందని భాగ్యశ్రీ రోజుల తరబడి కుమిలిపోయింది. మనశ్శాంతి లేక మరణాన్ని కోరుకోవాలనుకునేది. కానీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను చూసి ఆగిపోతూ వచ్చింది. జీవితంలో నిలబడేందుకు నెలల తరబడి మౌన పోరాటం చేసింది. చివరకు ఓడిపోయి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి చరణ్‌ ఉద్యోగానికి వెళ్లి శనివారం ఉదయం 11 గంటలకు ఇల్లు చేరుకున్నాడు. భోజనం చేసి సమీపంలో ఉన్న అన్న ఇంటికి వెళ్లి అక్కడే నిద్రించాడు. కల్లోల మనసుతో ఉన్న భాగ్యశ్రీ..అంగన్‌వాడీలో ఉన్న చిన్నారులను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళ్లింది. ఉదయం నుంచీ ఏమీ తినకపోవడంతో కళ్లు తిరగడంతో రోడ్డుపై పడిపోయింది. వెంటనే గుర్తించిన అంగన్‌వాడీ సిబ్బంది ఆమెను సెంటర్‌కు తీసుకెళ్లి నీళ్లు తాపించి కాసేపు అక్కడే సేదదీర్చారు. కానీ తన జీవితానికి ‘మరణ శాసనం’ రాసుకున్న భాగ్యశ్రీ కాసేపటికే పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చింది. 11.30 గంటల ప్రాంతంలో పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చింది. అయితే భాగ్యశ్రీ పరిస్థితి చూసిన అంగన్‌వాడీ ఆయా... ఆమెకు, పిల్లలకు భోజనం పెట్టాలని భావించి 12.30 గంటలకు వారింటికి వెళ్లింది. తల్లీపిల్లలు గాఢ నిద్రలో ఉండడంతో ఆమె తిరిగి సెంటరుకు వెళ్లిపోయింది. అయితే  అరగంట గడవకముందే ఇద్దరు బిడ్డలతో భాగ్యశ్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి వారింటికి పరుగు తీసింది. ఇద్దరు చిన్నారులు నిర్జీవంగా పడి ఉండగా...భాగ్యశ్రీ దూలానికి చీరతో వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది.  

పిల్లలను చంపి..ఉరికి వేలాడి.. 
తాను వెళ్లిపోతే  పిల్లల పరిస్థితి ఏమిటని భావించిన భాగ్యశ్రీ నిద్రలోనే పిల్లలను గొంతు నులిమి చంపి, తాను ఉరి వేసుకున్నట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. విషయం తెలిసి పరుగున ఇంటికి వచ్చిన చరణ్‌...భార్యా పిల్లల మృతదేహాలు చూసి బోరున విలపించాడు. ‘లడ్డూ, లక్కీ... లేచి రాండ్రా, ఎంత పని చేశావు భాగ్యా’ అంటూ బిగ్గరగా అరవ సాగాడు.  సీఐ జయానాయక్, ఏఎస్‌ఐ ప్రసాద్, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భాగ్యశ్రీ రాసిన రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

చస్తానేమో గానీ తప్పు చేయను.. 
‘‘ఎందుకిలా మారిపోయావో తెలియట్లేదు. నా మీద అనుమానం మొదలైంది. ఇది నీకు వచ్చిన అనుమానం కాదు..ఎవరో చెప్పి ఇలా మాట్లాడిస్తున్నారు. నీకు ఎంత సేపూ మొబైల్, ఫ్రెండ్స్, క్రికెట్, మందు మాత్రమేనా? నీకోసం ఎదురు చూసే భార్య, పిల్లలు ఉంటారు. వాళ్లకీ మనసు ఉంటుంది. అది నీకు అర్థం కాలేదు. ఆనందం లేదు, సంతోషం లేదు... ఏమీ లేదు.. ఒంటరిగా బతుకుతున్నా. నీకు ఇష్టం లేదు.. అందుకే ఇలా చేస్తున్నావని నా మనసులో మాట చెప్పాలని చాలా సార్లు లెటర్లు రాశాను. కానీ నువ్వు ఫీల్‌ అవుతావని ఇవ్వలేకపోయాను. ఇప్పటికీ చెప్పకపోతే నేను తప్పు చేసినదాన్ని అవుతాను. నేను మషిని కానా, నాకు ఫీలింగ్స్‌ ఉండవా? ఎంత చెప్పినా వేస్ట్‌. నీ మైండ్‌ అంతలా పొల్యూట్‌ చేశారు. మా నాన్నని చూడాలని ఉంది. ఒక్కసారి చూపించు. నీకు ఇష్టం లేకపోతే నాకు డైవర్స్‌ ఇచ్చి.. నీకు ఇష్టం వచ్చిన వాళ్లను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నేను మాత్రం ఏ తప్పూ చేయలేదు. అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా సిద్ధం కానీ తప్పు మాత్రం చేయను. ఈ లైఫ్‌ నీతోనే అంతే. తప్పుగా మాట్లాడినా, నీ మనస్సు బాధ పెట్టినా నన్ను క్షమించు.’’   

ఇట్లు 
అందరూ ఉన్నా.. ఒంటరిగా బతుకుతున్న నేను(భాగ్య)  
 

మరిన్ని వార్తలు