‘మాస్కే కవచం’ ప్రచార కార్యక్రమం ప్రారంభం

27 Aug, 2020 18:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కరోనా మహమ్మారిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ‘మాస్కే కవచం’ పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది. విజయవాడలోని ఆర్ అండ్‌ బీ బిల్డింగ్ కోవిడ్ కమాండ్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. 

వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కోవిడ్ మహమ్మారిని అంతం చేయడమే ‘మాస్కే కవచం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఉపయోగించిన మాస్కుల్ని మూడురోజులపాటు మూసిన కవర్లో ఉంచి పారవేయలని సూచించారు. ఇలా చేస్తే ఒకరి నుండి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందదని పేర్కొన్నారు. ఇళ్లల్లో వయసు మీరిన వారికి కోవిడ్ వ్యాప్తి చెందకుండా యువత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బయటికి వెళ్లినప్పుడు యువత తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని కోరారు. మాస్కుల వల్ల ప్రయోజనాల్ని వైద్య ఆరోగ్య శాఖతో పాటు మిగతా ప్రభుత్వ శాఖలన్నీ  అవగాహన కల్పిస్తున్నాయన్నారు. నెల రోజుల విస్తృత ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని ఆళ్లనాని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు