టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ నేతల మూకుమ్మడి రాజీనామాలు

13 Jan, 2021 04:11 IST|Sakshi
విజయవాడలో సమావేశమైన టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ వివిధ జిల్లాల అధ్యక్షులు

పార్టీ నుంచి వైదొలగిన 13 జిల్లాల అధ్యక్షులు

సాక్షి, అమరావతి: మత సామరస్యాన్ని దెబ్బ తీస్తూ విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చర్యలను నిరసిస్తూ పలువురు క్రైస్తవ మైనార్టీ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. క్రైస్తవులను అవమానిస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయటానికి నిరసనగా 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు యలమంచిలి ప్రవీణ్‌ నేతృత్వంలో మంగళవారం విజయవాడలో  సమావేశమైన 13 జిల్లాల నాయకులు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అనంతరం ప్రవీణ్‌ మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ మతం గురించి చంద్రబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయన్నారు. 

చర్చిలో ప్రార్థనలు చేయలేదా బాబూ?: పాస్టర్లకి రూ.5 వేలు ఎవరు ఇమ్మన్నారని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారని, అదే విషయాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని మరిచారా? అని ప్రవీణ్‌ ప్రశ్నించారు. పోలీస్‌ స్టేషన్లలో క్రిస్మస్‌ వేడుకలు ఎలా జరుపుతారని ప్రశ్నించిన చంద్రబాబు గతంలో చర్చికి వచ్చి గంటన్నర ఎలా ప్రార్థన చేశారు? బైబిల్‌ ఎలా చదివారు? అని నిలదీశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు డి.వి.డి.వి.కుమార్, విజయవాడ అధ్యక్షుడు వెంకన్న, విశాఖ జిల్లా అధ్యక్షుడు బెన్హర్, తూ.గో.జిల్లా అధ్యక్షుడు రత్నరాజు, ప.గో.జిల్లా అధ్యక్షుడు విజయకుమార్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు వెస్లీ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఇమ్మానియేల్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు, కడప జిల్లా అధ్యక్షుడు విజయ్‌ బాబు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వి.సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, చంద్రబాబు తీరును ఖండిస్తూ ఆయన కార్యక్రమాలను అడ్డుకునేందుకు పలు క్రైస్తవ సంఘాలు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నెలాఖరులోపు విజయవాడలో భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి.  

మరిన్ని వార్తలు