ట్రిపుల్‌ఎఫ్‌ కర్మాగారంలో భారీ విస్ఫోటనం

22 Dec, 2022 04:17 IST|Sakshi
ట్రిపుల్‌ఎఫ్‌ కర్మాగారంలో పేలుడుకు ఎగసిన మంటలు

ఒకరు గల్లంతు.. ఐదుగురికి తీవ్రగాయాలు 

ఇద్దరి పరిస్థితి విషమం 

పెంటపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని ట్రిపుల్‌ఎఫ్‌ కర్మాగారంలో బుధవారం సాయంత్రం భారీ విస్పోటనం సంభవించింది. పరిశ్రమలో మూడంతస్తుల మేర ఉన్న ఎక్సైన్‌గా పిలిచే సాల్వెంట్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో 9 మంది పనిచేస్తుండగా వారిలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన గుడిగంట మల్లికార్జునరావు అనే కార్మికుడి ఆచూకీ తెలియలేదు.

అతడు గల్లంతైనట్టు భావిస్తున్నారు. కాగా మరో ముగ్గురు కార్మికులు తృటిలో తప్పించుకుని పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలిన ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిని తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్న ఇద్దరిని రాజమండ్రి తరలించినట్టు ఎస్‌ఐ జి.సత్యనారాయణ తెలిపారు. ఘటనా స్థలాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి విస్ఫోటనంలో దగ్ధమైన యంత్రాలను పరిశీలించారు.  బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఫోన్‌లో కోరారు.  

>
మరిన్ని వార్తలు