కాజ టోల్‌గేట్‌ వద్ద భారీ అగ్ని ప్రమాదం

11 Jun, 2021 05:18 IST|Sakshi
కాజ టోల్‌గేట్‌ వద్ద దగ్ధమవుతున్న లారీ

లారీ టైరు పేలడంతో చెలరేగిన మంటలు

తప్పిన ప్రాణాప్రాయం

మంగళగిరి: మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కాజ టోల్‌ గేట్‌ వద్ద గురువారం సాయంత్రం లారీ టైరు పేలడంతో లారీ దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. టోల్‌ గేట్‌ క్యాబిన్‌లకు మంటలు అంటుకోవడంతో సిబ్బంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళుతున్న తమిళనాడుకు చెందిన లారీ కాజ టోల్‌ ప్లాజా వద్ద టోల్‌ ఫీజు చెల్లించే సమయంలో లారీ టైరు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ అగ్నికీలల్లో చిక్కుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో లారీకి ఇరువైపులా ఉన్న టోల్‌ ఫీజులు వసూలు చేసే రెండు క్యాబిన్లు దగ్ధమయ్యాయి.

టోల్‌ ప్లాజా సిబ్బంది భయంతో అక్కడ నుంచి దూరంగా పారిపోయారు. లారీకి ముందు, వెనుక ఉన్న వాహనాల్లోని వారు కూడా వాహనాలు దిగి దూరంగా పరుగులు పెట్టడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. టోల్‌ గేట్‌ సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. కర్ఫ్యూ కారణంగా ప్రమాద సమయంలో టోల్‌ ప్లాజా వద్ద రద్దీ లేదు. దీంతో పెను ప్రమాదం తప్పిందని టోల్‌ గేట్‌ సిబ్బంది అన్నారు. టోల్‌ గేట్‌కు సుమారు రూ.30 లక్షలు నష్టం వాటిల్లినట్లు చెప్పారు. ప్రమాదానికి కారణమైన లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది. 

మరిన్ని వార్తలు