మైక్రో ‘సాఫ్ట్‌ స్కిల్స్‌’లో మనమే మేటి

25 Aug, 2022 03:53 IST|Sakshi

తొలిసారిగా భారీ ఎత్తున మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ప్రక్రియ 

రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ముందుకొచ్చిన ఐటీ దిగ్గజ సంస్థ 

విద్యార్థులపై భారం లేకుండా  ప్రభుత్వమే ఫీజులు భరించేలా ఏర్పాట్లు

రాష్ట్రంలో ఏటా ప్లేస్‌మెంట్లు 1.50 లక్షలకు పైగా పెరిగే అవకాశం 

ఇప్పటికే 36 వేల మంది సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్థినీ అత్యుత్తమ నైపుణ్యాలతో ప్రపంచస్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మరో మైలురాయిని అధిగమించాయి. ఉద్యోగాన్వేషణలో అత్యంత కీలకమైన సాఫ్ట్‌ స్కిల్స్‌ పెంపొందించడంపై 1.62 లక్షల మంది విద్యార్థులకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ  అందచేస్తున్న నేపథ్యంలో కోర్సు పూర్తి చేసినవారికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విశాఖలో నిర్వహించే కార్యక్రమంలో సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు.

రూ.465 కోట్ల వ్యయమయ్యే ఈ శిక్షణను మైక్రోసాఫ్ట్‌ సంస్థ రాష్ట్ర విద్యార్థులకు దాదాపు రూ.32 కోట్లకే అందిస్తుండడం విశేషం. అది కూడా విద్యార్థులపై నయాపైసా కూడా భారం లేకుండా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు కీలక సంస్కరణలు తెచ్చి ప్రతి విద్యార్థీ చదువుకునేలా సీఎం జగన్‌ ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారి చదువులు ముగిసే నాటికి పూర్తి నైపుణ్యాలు అందుకునేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.  

దేశంలో తొలి ప్రాజెక్టు మైక్రోసాఫ్ట్‌ అప్‌ స్కిల్లింగ్‌ 
ప్రపంచంలో అగ్రగామి ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ద్వారా రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వం శిక్షణ అందచేస్తోంది. కరోనా సమయంలో సరైన బోధన, శిక్షణ అందుబాటులో లేక విద్యార్థుల్లో నైపుణ్యాలు కొరవడ్డాయి. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్‌ అమెరికాలో చేపట్టిన వర్చువల్‌ శిక్షణ, సర్టిఫికేషన్‌ కోర్సుల గురించి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆ సంస్థతో సంప్రదింపులు జరిపారు.

పరిమిత సంఖ్యలో కాకుండా అందరికీ శిక్షణ అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం జగన్‌ సూచించడంతో ఏకంగా 1.62 లక్షల మంది విద్యార్థులతో మైక్రోసాఫ్ట్‌ అప్‌ స్కిల్లింగ్‌ ప్రాజెక్టుకు ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ శ్రీకారం చుట్టాయి. దేశంలోనే ఇది తొలి ప్రాజెక్టు కావడం గమనార్హం. ఇంజనీరింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులతో పాటు నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకూ శిక్షణ ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ (ఎంసీపీ), మైక్రోసాఫ్ట్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ (ఎంటీఏ), మైక్రోసాఫ్ట్‌ ఫండమెంటల్‌ విభాగాల్లో 40 రకాల కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. 

లింక్డిన్‌తో 8 వేల కోర్సుల్లో ఉచిత శిక్షణ
శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ కోర్సులే కాకుండా ‘లింక్డిన్‌’ ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేస్తున్నారు. దీనిద్వారా లింక్డిన్‌లోని టెక్నాలజీ, క్రియేటివిటీ, బిజినెస్‌ విభాగాల్లో 8 వేలకు పైగా కోర్సులు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. శిక్షణ పొందే విద్యార్ధికి మైక్రోసాఫ్ట్‌ సంస్థ వంద డాలర్ల విలువైన గిఫ్ట్‌ వోచర్లను కూడా అందిస్తోంది.

మైక్రోసాఫ్ట్‌ అందించే కోర్సులతో పాటు ఇతర కోర్సుల కోసం, ల్యాబ్‌ల కోసం ఈ గిఫ్ట్‌ వోచర్‌  క్రెడిట్‌ను విద్యార్థులు వినియోగించుకోవచ్చు. అజూర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, అజూర్‌ వర్చువల్‌ మెషీన్స్, అజూర్‌ ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్, యాప్స్‌ బిల్డింగ్‌ లాంవంటి కోర్సులకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణతో సంబంధం లేకుండా విద్యార్థులకు అవకాశం కలుగుతుంది.  

35,980 మందికి ఇప్పటికే శిక్షణ
గతేడాది చేపట్టిన మైక్రోసాఫ్ట్‌ అప్‌స్కిల్లింగ్‌ ప్రాజెక్టు ద్వారా 1.62 లక్షల మందికి సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 35,980 మందికి వర్చువల్‌ శిక్షణ పూర్తయింది. ఇతర విద్యార్థులకు శిక్షణ ప్రక్రియ పురోగతిలో ఉంది. 2022 అక్టోబర్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి విద్యార్థులను సాఫ్ట్‌ స్కిల్స్‌లో అత్యుత్తమంగా తీర్చిదిద్దనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.32 కోట్లను ప్రభుత్వమే భరిస్తున్నందున విద్యార్థులపై నయాపైసా కూడా భారం పడదు. 

ప్రభుత్వ చొరవతో...
తొలిసారిగా తమ సంస్థ ద్వారా ఏకంగా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు రావడం మైక్రోసాఫ్ట్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ విధంగా ఏ ప్రభుత్వమూ ప్రయత్నాలు చేయలేదంటూ వెంటనే శిక్షణకు ముందుకొచ్చింది. మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ కోర్సు శిక్షణ కోసం ఒక్కో విద్యార్థికీ రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు అవుతుంది. దీనికి అదనంగా పరీక్ష ఫీజు రూ.3,750 విద్యార్థే చెల్లించాలి. ఈ లెక్కన మొత్తం 1.62 లక్షల మంది విద్యార్ధుల శిక్షణ కోసం రూ.465 కోట్లు వ్యయమవుతుంది.

అత్యుత్తమ అవకాశాలు అందుకునేలా..
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ లాంటి అధునాతన సాంకేతికత అందుబాటులోకి వస్తున్న తరుణంలో మన విద్యార్థులకు ఆ దిశగాఅత్యుత్తమ నైపుణ్యాలు సమకూర్చేలా మైక్రోసాఫ్ట్‌ అప్‌స్కిల్లింగ్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. దీనిద్వారా ఆయా రంగాల్లో అత్యుత్తమ అవకాశాలను అందుకొనేందుకు సిద్ధంగా ఉంటారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ అందించే ఈ సర్టిఫికేషన్‌ కోర్సులకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉండడంతోపాటు ఉపాధి త్వరగా లభిస్తుంది. మైక్రోసాఫ్ట్‌ అప్‌స్కిల్లింగ్‌ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది.  ఉద్యోగావకాశాలు పొందేలా విద్యార్థులను పూర్తి సామర్థ్యాలతో తీర్చిదిద్దుతుంది.
– ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌

రేపు విశాఖలో సర్టిఫికెట్లు అందించనున్న సీఎం జగన్‌
ఇప్పటికే దాదాపు 36 వేల మంది మైక్రోసాఫ్ట్‌ అప్‌స్కిల్లింగ్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి చేసిన నేపథ్యంలో విశాఖపట్నంలో శుక్రవారం ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శిక్షణ పూర్తి చేసిన వారికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేయనుంది. 

మరిన్ని వార్తలు