అటవీ శాఖలో భారీగా బదిలీలు 

28 Sep, 2022 05:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో కొత్త జిల్లాలకు అనుగుణంగా అటవీ శాఖను పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం అక్కడ కొత్తగా అటవీ శాఖాధికారులను నియమించింది. 26 జిల్లాల్లో 32 టెరిటోరియల్‌ డివిజన్లు, 12 సోషల్‌ ఫారెస్ట్‌ డివిజన్లు, వైల్డ్‌ లైఫ్‌ డివిజన్లకు డివిజినల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ (డీఎఫ్‌వో)లను నియమించింది. ఇందుకోసం ఇప్పుడు పనిచేస్తున్న డీఎఫ్‌వోలను బదిలీ చేసింది. ఆ డివిజన్లలో ఇతర అధికారులు, సిబ్బందిని కూడా నియమించింది.

బుధవారం నుంచి కొత్త డివిజన్ల ప్రకారం అటవీ శాఖ పనిచేయనుంది. అటవీ, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖల స్వరూపం జిల్లాల వారీగా, రెవెన్యూ డివిజన్లకు అనుగుణంగా ఉండదు. ఒక జిల్లాలో 3, 4 డివిజన్లు.. కొన్నిచోట్ల 2 జిల్లాలకు కలిపి ఒక డివిజన్‌ ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే జిల్లాల పునర్విభజన సమయంలో అటవీ శాఖ పునర్వ్యవస్థీకరణ జరగలేదు.

అటవీ శాఖ స్వరూపాన్ని బట్టి పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. దీంతో 2 నెలల్లో కసరత్తు చేసి ఇటీవలే అటవీ శాఖను పునర్వ్యవస్థీకరించారు. వాటి ప్రకారం మంగళవారం సిబ్బందిని బదిలీ చేశారు. 

ప్రతి జిల్లాకు ఒక డివిజన్‌ 
పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రతి జిల్లాకు ఒక డివిజన్‌ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ ఉన్నట్లే జిల్లా అటవీ శాఖాధికారి ఒకరు ఉండేలా చూశారు. ఆయా జిల్లాల్లో ఎక్కువ అడవి ఉంటే అక్కడ అదనంగా డివిజన్లు సృష్టించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా అటవీ శాఖాధికారిని నియమించారు. ఆ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉండడంతో మరో 3 డివిజన్లు సృష్టించి వాటికి  డీఎఫ్‌ఓలను నియమించారు.

జిల్లాలో అటవీ శాఖను సమన్వయం చేసేది పాడేరులోని జిల్లా అటవీ శాఖాధికారే. ఇలా అన్ని జిల్లాలను అటవీ విస్తీర్ణాన్ని బట్టి పునర్వ్యవస్థీకరించారు. ఆ డివిజన్ల ప్రకారం బుధవారం నుంచి పరిపాలన ప్రారంభం కానున్నట్లు అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ వై. మధుసూదన్‌రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు