టెన్షన్‌.. టెన్షన్‌

27 Feb, 2021 04:32 IST|Sakshi

భారీగా పెరుగుతున్న బీపీ కేసులు

అదే దారిలో మధుమేహం కూడా

58.99 లక్షల మంది మహిళల్లో హైపర్‌ టెన్షన్‌

45.47 లక్షల మంది మహిళల్లో మధుమేహం 

గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్న జీవనశైలి జబ్బులు

పురుషుల్లోనూ భారీగా పెరుగుతున్న కవల జబ్బులు

అవగాహన రాహిత్యమే కారణమని వైద్యుల వెల్లడి

రక్తపోటు, మధుమేహం.. రెండూ రెండే. తొలుత ఒకటి వస్తే.. కొద్ది రోజులకే రెండవది వచ్చి జతవుతోంది. వీటితో సతమతమవుతున్న వారు సగటున ప్రతి ఇంట్లో ఒకరుంటున్నారు. ఈ విషయాన్ని త్వరగా తెలుసుకోకపోతే భారీ నష్టమే వాటిల్లుతుంది. 

సాక్షి, అమరావతి: జీవన శైలి జబ్బుల్లో అత్యంత ప్రమాదకారిగా నిపుణులు హెచ్చరిస్తున్న హైపర్‌ టెన్షన్‌ (రక్తపోటు), మధుమేహం ఇప్పుడు రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఈ రెండు జబ్బులు కవలలని చెబుతుంటారు. దేశంలోనే ఎక్కువగా జీవనశైలి జబ్బుల బాధితులున్న రాష్ట్రాల్లో ఏపీ తరచూ మొదటి లేదా రెండో స్థానంలో ఉంటోంది. గతంలో 45 ఏళ్లు దాటిన వారే ఈ జబ్బుల బారిన పడే ప్రమాదం ఉండేది. గడిచిన దశాబ్ద కాలంగా 30 ఏళ్లు నిండీ నిండక మునుపే ఈ రెండు జబ్బులు యువతను కమ్మేస్తున్నాయి. వారికి తెలియకుండానే జబ్బు బాధితులుగా మార్చేస్తున్నాయి. మహిళల్లోనూ ఎక్కువ మంది హైపర్‌ టెన్షన్‌ బారిన పడ్డట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

పెరుగుతున్న బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు
► హైపర్‌ టెన్షన్‌ కారణంగా గత ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు 30 శాతం బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మద్యం సేవించడం వల్ల ఎక్కువ మంది యువకులు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
► రాష్ట్రంలో 30 ఏళ్ల వయసు దాటిన మహిళలు 2.33 కోట్ల మంది ఉండగా, అందులో 25.3 శాతం మంది అంటే 58,99,960 మంది మహిళలు హైపర్‌ టెన్షన్‌ బాధితులే.
► రాష్ట్రంలో 30 ఏళ్ల వయసు దాటిన పురుషులు 2.38 కోట్ల మంది ఉండగా, వీరిలో 29 శాతం మంది అంటే 69,04,204 మంది హైపర్‌టెన్షన్‌ వలలో చిక్కుకొని ఉన్నారు.
► మధుమేహం బారిన పడిన మహిళలు 19.5 శాతం మంది అంటే 45,47,400 మంది ఉన్నారు. పురుషుల్లో 21.8 శాతం మంది అంటే 51.90,056 మంది మధుమేహంతో బాధ పడుతున్నారు.

ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి
ప్రధానంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. చిరు ధాన్యాల వాడకం పెంచాలి. ప్రధానంగా హైపర్‌ టెన్షన్, మధుమేహం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్, గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ఎలాంటి వ్యాయామం లేకుండా ఎక్కువ మోతాదులో బియ్యం వాడకం మంచిది కాదు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పుడు ఎన్‌సీడీ (అసాంక్రమిక వ్యాధుల) స్క్రీనింగ్‌ జరుగుతోంది. ప్రాథమిక దశలోనే తెలుసుకుంటే మంచిది.
– డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రముఖ న్యూరో ఫిజీషియన్‌  

మరిన్ని వార్తలు