భారీగా తగ్గిన పాజిటివిటీ రేటు

16 Jun, 2021 02:59 IST|Sakshi

రాష్ట్రంలో మే 16న అత్యధికంగా 25.56%.. ఇప్పుడు కేవలం 5.98 శాతమే

కర్ఫ్యూ, ఫీవర్‌ సర్వేలు, ఎప్పటికప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షలతో సత్ఫలితాలు

జాతీయ సగటును మించి రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌

హెల్త్‌కేర్‌ వర్కర్స్‌లో 83.1 శాతం మందికి మొదటి డోసు

దేశంలో ఇది 81.3 శాతమే

రాష్ట్రంలో 45ఏళ్లు పైబడిన వారిలో 46% మందికి మొదటి డోసు

దేశంలో ఈ వయసు వారిలో 39.7% మందికే మొదటి డోసు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కట్టుదిట్టమైన కర్ఫ్యూ మూడు రోజులకు ఒకసారి ఫీవర్‌ సర్వే నిర్వహించడం.. కోవిడ్‌ లక్షణాలున్న వారిని గ్రామాల పరిధిలోనే ఐసొలేట్‌ చేయడం.. వారానికి రెండుసార్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సమీక్షించి అధికారులను అప్రమత్తం చేస్తుండటం.. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జాతీయ సగటును మించి జోరుగా సాగుతుండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య, శాతం గణనీయంగా తగ్గింది. గత నెల (మే) 16న ప్రతి 100 టెస్టుల్లో 25.56% మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 94,550 మందికి పరీక్షలు చేయగా 24,171 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రోజుకు 5 వేల కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం 96,153 టెస్టులు చేయగా 5,741 మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 5.98 శాతం మాత్రమే నమోదైంది. మేలో ప్రతి జిల్లాలోనూ 17 నుంచి 24 శాతం వరకు పాజిటివిటీ రేటు కొనసాగింది. ప్రధానంగా.. చిత్తూరు, తూర్పుగోదావరి వంటి జిల్లాల్లో రోజుకు 2 వేలకుపైగా కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు అక్కడ కూడా కేసులు నియంత్రణలోకి వచ్చాయి. మరోవైపు గత నెల రోజులుగా టెస్టుల సంఖ్యను ప్రభుత్వం ఏ మాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం 12వ విడత ఫీవర్‌ సర్వే నిర్వహిస్తోంది. ఇలా నిరంతరం ఫీవర్‌ సర్వే చేస్తూ గ్రామాల్లో జ్వరబాధితులను ఎప్పటికప్పుడు ఐసొలేట్‌ చేస్తూ కోవిడ్‌ వ్యాప్తిని తగ్గిస్తోంది.

జాతీయ సగటుని మించి ఏపీ దూకుడు
రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణ చర్యలతోపాటు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఈ విషయంలో జాతీయ సగటుని మించి ఏపీ ముందుకు దూసుకెళ్తోంది. హెల్త్‌కేర్‌ వర్కర్లు మొదలుకొని.. ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లుల వరకు ఎప్పటికప్పుడు టీకా వేస్తున్నారు. దేశంలో ఒక్కరోజులో 6.28 లక్షల డోసుల టీకాను వేసిన రాష్ట్రంగా ఏపీ ఇప్పటికే రికార్డు సాధించిన విషయం తెలిసిందే. తాజా గణాంకాల ప్రకారం చూస్తే.. ఏపీలో జాతీయ సగటు కంటే మించి టీకాలు వేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్టు స్పష్టమైంది. మొత్తం 1,400కు పైగా సీవీసీ (కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్స్‌)ల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు 19 వేల మంది ఏఎన్‌ఎంలు, 40 వేల మందికిపైగా ఆశా కార్యకర్తలు, 2 వేల మందికిపైగా వైద్యాధికారులు ఈ ప్రక్రియలో సేవలు అందిస్తున్నారు. వీరితోపాటు గ్రామ/వార్డు వలంటీర్ల సహకారం కూడా మరువలేనిది. 28 వ్యాక్సిన్‌ రవాణా వాహనాలు సైతం జిల్లాలకు టీకాను చేర్చడంలో అద్భుతంగా పనిచేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రత్యేక నోడల్‌ అధికారులు, ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. వ్యాక్సిన్‌ సరిపడా ఉంటే టీకా వేయడంలో చాలా రాష్ట్రాల కంటే ఇంకా ముందంజలో ఉంటామని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు