పర్యాటకం ప్రకాశించేలా!

25 May, 2021 04:12 IST|Sakshi

రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సర్కారు ప్రణాళిక

ఇప్పటికే ఉన్న పర్యాటక కేంద్రాల్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నిర్ణయం

విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.1,200 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌

రూ.61.74 కోట్లతో వివిధ పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి

కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్‌ కేంద్రాలుగా విశాఖపట్నం–తిరుపతి

పీపీపీ విధానంలో శిల్పారామాల అభివృద్ధి.. 

సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు లాక్‌డౌన్‌ కాలాన్ని చక్కగా వినియోగించుకోబోతోంది. లాక్‌డౌన్‌ వల్ల పర్యాటక కేంద్రాలు మూతపడిన దృష్ట్యా ఈ సమయంలో వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర పర్యాటక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.61.74 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని అన్ని శిల్పారామాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించడంతోపాటు వాటిని ఆధునికీకరించడానికి పీపీపీ విధానంలో మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. కనీసం 6 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేలా ఏడాది పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విజయవాడ భవానీ ద్వీపంలో రూ.6 కోట్లతో 3డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్, 5డీ థియేటర్స్‌ను అభివృద్ధి చేస్తోంది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా సముద్ర ప్రాంతంలో జెట్టీల అభివృద్ధితోపాటు, రుషికొండ బీచ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అటవీ శాఖతో కలిసి కనీసం 12 ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తోంది. అటవీ ప్రాంతంలో సుందరమైన కాటేజీల నిర్మాణంతో పాటు సఫారీ, ట్రెక్కింగ్‌ వంటి వసతులు కల్పించనున్నారు.

ఎంఐసీఈ టూరిజం కేంద్రాలుగా విశాఖ, తిరుపతి
రాష్ట్రంలో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించే విశాఖ, తిరుపతిల్లో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎంఐసీఈ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్స్‌) టూరిజం ఆకర్షణలో భాగంగా విశాఖ, తిరుపతి నగరాలను అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, సదస్సులకు వేదికగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఆ రెండుచోట్ల అంతర్జాతీయ వసతులతో భారీ ఎగ్జిబిషన్, కన్వెన్షన్‌ సెంటర్లు నిర్మించడం ద్వారా భారీ ఆదాయాన్ని పొందవచ్చన్నది పర్యాటక శాఖ భావన. సుమారు రూ.6 వేల కోట్లతో ఎంఐసీఈ టూరిజంలో భారత్‌ ప్రస్తుతం 27వ స్థానంలో ఉంది. ఏటా కనీసం 20 శాతం వృద్ధితో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఆదాని సంస్థ సొంతంగా ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించనుండగా, పర్యాటక శాఖ భీమిలి ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ అభివృద్ధి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది.

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ
ఏటా రాష్ట్రానికి సుమారు 1.70 కోట్ల మంది దేశీయ, విదేశీ పర్యాటకులు వస్తున్నారు. ఇందులో 15 శాతం మంది అంటే  25 లక్షల మందిని విశాఖ ఆకర్షిస్తోంది. విశాఖ బీచ్‌లు, బొర్రా గుహలు, అరకు, సింహాచల దేవస్థానం వంటివి ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. దీంతో విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. భీమిలి–భోగాపురం బీచ్‌ కారిడార్‌లో భాగంగా రూ.1,200 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా భీమిలి మండలం అన్నవరం వద్ద 200 ఎకరాల్లో భారీ హోటల్స్, రిసార్టుల నిర్మాణం చేపడుతున్నారు. 30 ఎకరాల్లో ఒకటి, 35 ఎకరాల్లో ఒకటి చొప్పున రెండు లగ్జరీ రిసార్టులు, 15 ఎకరాల్లో లగ్జరీ హోటల్, 5 ఎకరాల్లో మినీ గోల్ఫ్‌ కోర్స్, 60 ఎకరాల్లో బీచ్‌ అభివృద్ధి చేయనున్నారు. తొట్లకొండ బీచ్‌ వద్ద పీపీపీ విధానంలో భారీ టన్నెల్‌ అక్వేరియాన్ని అభివృద్ధి చేయనున్నారు. కైలాసగిరి వద్ద 120 మీటర్ల ఎత్తులో స్కై టవర్, ఆర్‌కే బీచ్‌ అభివృద్ధి వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టనున్నారు.  

మరిన్ని వార్తలు