బాలింతల సేవలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌

27 May, 2022 13:53 IST|Sakshi

పార్వతీపురంటౌన్‌: ప్రసవానంతరం తల్లీబిడ్డలు ఆస్పత్రినుంచి వారి ఇళ్లకు  క్షేమంగా వెళ్లాలని భావించి రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ (102) సర్వీసులు వారికి బాగా సేవలందిస్తున్నాయి. గతంలోనూ ఉన్న ఈ పథకం  వాహనాలను ఆధునీకరించి అందుబాటులోకి  తీసుకువచ్చింది. బాలింత చేరేగమ్యం ఎంత దూరమైనా,  ఏప్రాంతమైనా మేమున్నామంటూ వాహనం ముందుకు వచ్చి సేవలందిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా వారిని ఇళ్లకు చేరవేస్తూ ఏప్రిల్‌1న ప్రశంసలు అందుకుంటోంది.

రాష్ట్రప్రభుత్వం ఆధునీకరించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహన సేవలు పార్వతీపురం నియోజకవర్గంలో  దూసుకుపోతున్నాయి. గత ఏప్రిల్‌ 1న రాష్ట్రవ్యాప్తంగా 2వ తేదీన పార్వతీపురం పట్టణానికి ఈ వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పార్వతీపురంలో ఈ సేవలు అరకొరగా ఉండేవి.  గతంలో ఒక్కో వాహనంలో నలుగురైదుగురు బాలింతలు వెళ్లాల్సివచ్చేది. ఉదయం డిశ్చార్జ్‌ అయినా సాయంత్రం వరకు ఊళ్లకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు.

ఇలాంటి పరిస్థితిని దూరం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి నాలుగు వాహనాలు, పార్వతీపురం మండలానికి  ఒక వాహనం, సీతానగరం మండలానికి ఒకటి కేటాయించింది. ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతలను పూర్తి ఉచితంగా ఈ వాహనాల ద్వారా ఇళ్లకు చేరవేస్తున్నారు.  ఈ సేవలతో బాలింతలు, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.    

క్షేమంగా గమ్యం చేర్చడమే లక్ష్యం  
గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన బాలింతలు  ఎవరికి వారే సొంత వాహనాల్లో ఖర్చుపెట్టుకుని ఇళ్లకు వెళ్లేవారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ఒక్కరూపాయి ఖర్చులేకుండా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా సొంతిళ్లకు చేరుస్తోంది. ఈ సేవలను నియోజవకర్గ వ్యాప్తంగా అందిస్తున్నాం.  
ఎస్‌.మన్మథనాయుడు, 102 సర్వీసుల పర్యవేక్షకుడు  
 

మరిన్ని వార్తలు