Godavari Floods 2022: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం

17 Jul, 2022 03:15 IST|Sakshi
పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం వారధి వద్ద ఉధృతంగా గోదావరి

16 సంవత్సరాల తర్వాత గోదావరికి గరిష్ట వరద 

25,56,474 క్యూసెక్కుల ప్రవాహం.. 21.50 అడుగుల్లో నీటిమట్టం

నేటి ఉదయం నుంచి ఉధృతి తగ్గే అవకాశం.. కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ఎగువన శాంతిస్తున్న గోదారమ్మ.. 

రేపు భద్రాచలం వద్ద 45 అడుగుల కంటే దిగువకు చేరుకునే అవకాశం

పోలవరాన్ని పర్యవేక్షించిన మంత్రి అంబటి 

36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎదుర్కొనేలా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పటిష్టం, ఎత్తు పెంపు పనులు 

సాక్షి, అమరావతి, ధవళేశ్వరం, సాక్షి ప్రతినిధి, ఏలూరు, నెట్‌వర్క్‌: భద్రాచలం నుంచి వస్తున్న వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండడంతో గోదారమ్మ అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భీతిగొలిపేలా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గోదావరి వరద విరుచుకుపడుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఊరూ ఏరూ ఏకమయ్యాయి. లంకలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు.

ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలం నుంచి వరద పోటెత్తుతుండటంతో పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన గోదారమ్మ శాంతిస్తోంది. ప్రాణహిత గోదావరిలో కలిసే ప్రదేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజ్‌లోకి వరద 11.65 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆ దిగువన సమ్మక్క(తుపాకులగూడెం) బ్యారేజ్‌లోకి వచ్చే వరద కూడా 13.16 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆ తర్వాత ఉన్న సీతమ్మసాగర్‌లోకి వచ్చే వరద కూడా 21.18 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. 
ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద ఉధృతి 

భద్రాచలంలో క్రమంగా తగ్గుముఖం..
ఎగువ నుంచి విడుదలైన ప్రవాహం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు భద్రాచలం వద్దకు 24,43,684 క్యూసెక్కులు చేరడంతో వరద మట్టం 71.30 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఎగువ నుంచి ప్రవాహం గంట గంటకూ తగ్గడంతో వరద నీటిమట్టం కూడా తగ్గుతూ వచ్చింది. శనివారం రాత్రి 9 గంటలకు 22,41,144 క్యూసెక్కులకు తగ్గడంతో భద్రాచలం వద్ద వరద మట్టం 67.70 అడుగుల్లో ఉంది. 53 అడుగుల కంటే దిగువకు చేరుకునే వరకూ మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. సోమవారం ఉదయానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 45 అడుగులు లేదా అంతకంటే దిగువకు చేరుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

పోలవరం వద్ద అప్రమత్తం..
భద్రాచలం నుంచి దిగువకు వరద పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తిలతో కలసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరద నియంత్రణను పర్యవేక్షించారు. శనివారం రాత్రి పోలవరంలోకి 22,41,144 క్యూసెక్కులు చేరుతుండటంతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద మట్టం 38.760 మీటర్లకు, దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 28.820 మీటర్లకు చేరుకుంది.

ఆదివారం ఉదయం వరకూ పోలవరం వద్ద వరద పెరగనున్న నేపథ్యంలో అధికారులు కంటికి కునుకు లేకుండా సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరంలోకి 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎదుర్కొనేలా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పటిష్టం చేయడం, ఎత్తు పెంపు పనులను ముమ్మరం చేశారు. 40.5 మీటర్ల నుంచి 42.5 మీటర్ల వరకూ కాఫర్‌ డ్యామ్‌ మధ్యలో కోర్‌ (నల్లరేగడి మట్టి) నింపి మరో 1.5 మీటర్ల ఎత్తున మట్టికట్ట నిర్మాణ పనులను వేగవంతం చేశారు. తద్వారా కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు 44 మీటర్లకు చేరుకోనుంది.
కోనసీమ జిల్లా పాశర్లపూడిబాడవలో వరద బాధిత కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యం   

ధవళేశ్వరంలో వచ్చిన వరద వచ్చినట్లే..
ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి శనివారం రాత్రి 9 గంటలకు 25,56,474 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 21.50 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. డెల్టా కాలువలకు 11,500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 25,48,974 క్యూసెక్కులను బ్యారేజ్‌ 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు.

2006 ఆగస్టు 7న బ్యారేజ్‌లోకి 28,50,664 క్యూసెక్కులు రావడంతో నీటి మట్టం 22.80 అడుగులకు చేరుకుంది. 16 ఏళ్ల తర్వాత శనివారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గరిష్ట వరద ప్రవాహం రావడం.. అది కూడా జూలైలోనే రావడం గమనార్హం. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వరద శనివారం అర్ధరాత్రి గరిష్ట స్థాయికి చేరుకుని ఆదివారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. కాటన్‌ బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను అనుమతించడంలేదు.

వైఎస్సార్‌ ముందుచూపుతో..
ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించారు. 2004–05లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో రూ.650 కోట్లతో గోదావరి ఏటిగట్లను పటిష్టం చేయడంతో 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునే విధంగా ఉన్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులు 

సహాయ శిబిరాల్లో 71,200 మంది
ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లో 76,775 మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 71,200 మందిని 177 పునరావాస కేంద్రాలకు తరలించి సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాడేపల్లిలోని స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌ నుంచి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్,  ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పది చొప్పున సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి.

62 మండలాల్లో 324 గ్రామాలు వరద బారినపడ్డాయి. మరో 191 గ్రామల్లోకి నీరు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురంలో అనారోగ్యంతో ఉన్న దేవి ముత్యాలమ్మ (68) శనివారం తెల్లవారు జామున బయటకు వెళ్తున్న క్రమంలో గోదావరిలో పడిపోయి గల్లంతైంది. ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఏటిగట్టు ప్రాంతంలో పలువురు పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఇళ్ల వద్దే ఉన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలంక గ్రామానికి పడవపై వెళ్తున్న హోం మంత్రి తానేటి వనిత, జెడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌   

► అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏడు మండలాల్లో 125 గ్రామాలు మునిగిపోగా 165 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. జిల్లాలో 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 49,623 మందిని తరలించారు. చింతూరు, ఎటపాక మండలాల్లో ఎక్కువ గ్రామాలు మునిగిపోయాయి. గోదావరి ఒడ్డున ఉన్న వీఆర్‌ పురం, దేవీపట్నం, కూనవరం మండలాల్లో ముంపు తీవ్రంగా ఉంది. 
► అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 18 మండలాల్లోని 74 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. 18 పునరావాస కేంద్రాలు ఏర్పాటు ఏసి 9,290 మందిని తరలించారు. 
► ఏలూరు జిల్లాలో ఏడు మండలాలకు చెందిన 26 గ్రామాలు ముంపులో ఉండగా 33 గ్రామాల్లోకి నీరు చేరింది. 18 పునరావాస కేంద్రాలు తెరిచి 9,363 మందిని తరలించారు. 
► పశ్చిమ గోదావరి జిల్లాలోని 8 మండలాల్లో 28 గ్రామాలు ముంపులో ఉండగా మరో 27 గ్రామాల్లోకి నీరు చేరింది. 18 పునరావాస కేంద్రాల్లోకి 1345 మందిని తరలించారు. 
► తూర్పు గోదావరి జిల్లాలో 21 మండలాల్లో 13 గ్రామాలు ముంపునకు గురవగా 23 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. 
► కాకినాడ జిల్లాలో తాళ్లరేవు ముంపునకు గురి కావడంతో సహాయ శిబిరం ఏర్పాటు చేసి 90 మందిని తరలించారు. 
► ఇళ్లు నీట మునగడంతో తలదాచుకునేందుకు పైకి ఎక్కిన వందలాది మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ , ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. 

మరిన్ని వార్తలు

ge, 1000);