విజయవాడ, విశాఖలో అమూల్‌ యూనిట్లు

29 Jan, 2022 03:47 IST|Sakshi

వచ్చే నెలలో ఏర్పాటు.. ఇప్పటికే మదనపల్లెలో ప్రారంభం 

అమూల్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోధి వెల్లడి 

ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిగా రోజూ లక్ష లీటర్ల పాల సేకరణ 

పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ సమ ఉజ్జీలు

మరో రెండు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు 

సాక్షి, అమరావతి: వచ్చే నెలలో విజయవాడ, విశాఖపట్నంలో అమూల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయనుందని ఆ సంస్థ ఎండీ ఆర్‌ఎస్‌ సోధి తెలిపారు. ఇప్పటికే మదనపల్లిలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేశామన్నారు. తద్వారా అక్కడే పాలు ప్రాసెస్‌ చేసి, ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా అనంతపురం జిల్లాలో  జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్‌ఎస్‌ సోధి మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు చెందిన మహిళలు అమూల్‌లో భాగస్వామ్యం అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.

సీఎం జగన్‌ తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రంలో పాడి రంగం ప్రాధాన్యతను గుర్తించారని చెప్పారు. అమూల్‌ రైతుల సంస్థ అని, దీనికి 75 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. గుజరాత్‌లో 36 లక్షలు, రాష్ట్రం వెలుపల మరో 7 లక్షల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ రెండూ సమ ఉజ్జీలుగా ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజూ దాదాపు 4.25 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా, గుజరాత్‌లో కూడా అదే స్థాయిలో పాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. గుజరాత్‌లోని పాడి పశువుల్లో 60 శాతం గేదెలు, 40 శాతం ఆవులు ఉండగా, ఇక్కడా దాదాపు అదే విధంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పాల సేకరణలో సంఘటిత రంగం పాత్ర 26 శాతం మాత్రమే ఉందని తెలిసిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

రైతులే యాజమాన్యంగా ఉన్న సంస్థ 
అమూల్‌ సంస్థ గుజరాత్‌లో రోజూ 2.5 కోట్ల లీటర్లు, రాష్ట్రం వెలుపల మరో 50 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిగా పాలు సేకరిస్తున్నాం. రోజుకు దాదాపు లక్ష లీటర్ల పాలు ఇక్కడ అమూల్‌ సేకరిస్తోంది.  
 అయితే ఇక్కడ (రాష్ట్రంలో) పాల ప్రాసెసింగ్‌కు తగిన సదుపాయాలు కల్పించాల్సి ఉంది. అమూల్‌ ఇప్పటికే మదనపల్లిలో ఒక ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసింది. విజయవాడ, విశాఖపట్నంలో వచ్చే నెలలో ఆ యూనిట్లు ప్రారంభం అవుతాయి. అప్పుడు పాలు ప్రాసెస్‌ చేసి, ప్యాక్‌ చేసి విక్రయిస్తాం. 
 అమూల్‌ సంస్థలో అటు ప్రభుత్వం కానీ, ఇటు బహుళజాతి సంస్థ కానీ, పారిశ్రామికవేత్త కానీ లేడు. ఇది కేవలం రైతులే యాజమాన్యంగా ఉన్న సంస్థ. నేను పాడి రంగంలో నిపుణుడిని. 40 ఏళ్లుగా సంస్థలో పని చేస్తున్నాను. మిగతా వారంతా రైతులే.  
 సంస్థలో అత్యంత పనితీరు చూపుతున్న మూడు పాడి రైతుల సహకార సంఘాలను (కైరా యూనియన్, సబర్‌కాంత యూనియన్, బనస్కాంత యూనియన్‌) రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు పంపించాం. తద్వారా  రానున్న రోజుల్లో పాల సేకరణ మరింత పెరుగుతుంది. 
పాలు, పౌష్టికాహారం సరఫరా 
 గుజరాత్‌లో అమూల్‌ సంస్థ గత 15 ఏళ్లుగా ప్రతి రోజూ అంగన్‌వాడీలు, స్కూళ్లలో దాదాపు 25 లక్షల మంది పిల్లలకు తాజా ఫ్లేవర్డ్‌ పాలు సరఫరా చేస్తోంది. సమీపంలో ఉన్న ప్రాసెసింగ్‌ యూనిట్ల నుంచి చల్లటి తాజా ఫ్లేవర్డ్‌ పాలను పిల్లలకు సరఫరా చేస్తున్నాము.  
 ఇదే రీతిలో రాష్ట్రంలో కూడా ప్రాసెసింగ్‌ యూనిట్లకు చేరువలో ఉన్న గ్రామాల్లో అదే విధంగా ఫ్లేవర్డ్‌ పాలు సరఫరా చేస్తాం. గుజరాత్‌లోని అంగన్‌వాడీల పిల్లలకు గత 4 ఏళ్లుగా పౌష్టికాహారం అందజేస్తున్నాము. ఇందుకోసం మూడు ప్లాంట్లు ఏర్పాటు చేసి, 15 వేల టన్నుల పౌష్టికాహారం సరఫరా చేస్తున్నాం.  
అదే కోవలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సబర్‌కాంత పాడి సహకార సంఘం ఒక ప్లాంట్‌ ఏర్పాటు చేసి, పిల్లలకు అత్యంత నాణ్యతతో కూడిన పౌష్టికాహారం సరఫరా చేస్తుంది. పాల సేకరణ మాత్రమే కాకుండా మరో రెండు ప్రాజెక్టుల్లో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాపై ఉంచిన నమ్మకం ఎక్కడా వమ్ము కాకుండా చూస్తాం. రాష్ట్రంలో పాడి ఒక బలమైన  ఉపాధి రంగంగా ఎదుగుతుందని గట్టిగా నమ్ముతున్నాం.  
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

రైతులకు అదనపు ఆదాయం 
రాష్ట్రంలో రోజుకు 4 కోట్ల లీటర్ల పాలు సేకరిస్తే అందులో సగం గృహ వినియోగదారులు వాడుతున్నారు. మిగతా పాలలో కేవలం 26 శాతం మాత్రం ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లో అమ్ముడవుతుండగా, మిగిలినవి అన్‌ ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లోకి వెళ్తున్నాయి. మధ్యవర్తులు, దళారీల కారణంగా డెయిరీ రైతులు మోసపోతున్నారు. ఈ క్రమంలో సీఎం ఆలోచన మేరకు అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. తద్వారా ప్రతి పాడి రైతుకు అమూల్‌ ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. త్వరలో మిగిలిన జిల్లాల్లో కూడా పాల సేకరణ ప్రారంభిస్తాం. 
– డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి 

పాడి రైతుల్లో ఆనందం 
అమూల్‌తో ఒప్పందంతో పాడి రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్‌ పిల్లలందరికీ పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో సీఎం వినూత్న మార్పులు తీసుకొచ్చారు. ఎవరూ రక్తహీనతతో బాధపడకూడదని వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా ఎక్కువ బడ్జెట్‌ కేటాయించారు. ఇప్పటివరకు తెలంగాణ నుంచి బాలామృతం, కర్ణాటక నుంచి మిల్క్‌ తెప్పించుకుంటున్నాం. ఇప్పుడు అమూల్‌ భాగస్వామ్యంతో ఆ సమస్యలు తీరుతాయి.   – తానేటి వనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి  

మహిళల డెయిరీ అని గర్వంగా ఉంది 
గతంలో ప్రేవేట్‌ డెయిరీలో పాలు పోసి చాలా నష్టపోయాం. ఇప్పుడు అమూల్‌ డెయిరీలో పాలు పోయగానే.. అన్ని వివరాలతో మెసేజ్‌ వస్తోంది. ఇది మా మహిళల డెయిరీ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు దాణా కూడా ఇస్తున్నారు. గతంలో ఏమీ ఇవ్వలేదు. ఇప్పడు బోనస్‌ కూడా వస్తుంది. మేం వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నాం. మీ (సీఎం) సహకారంతో ఇంకా పాడి పశువులు పెంచుకుని మరింత వృద్ధి చెందుతాం.   – అనసూయమ్మ,     కఠారుపల్లి, గాండ్లపెంట మండలం, అనంతపురం జిల్లా   

జగనన్నా.. మీ మేలు మరువలేం 
మాకు ఆరు ఆవులకు గాను మూడు ఆవులు పాలు ఇస్తున్నాయి. గతంలో ప్రేవేట్‌ డెయిరీలకు పాలు పోస్తే తక్కువ డబ్బులు ఇచ్చే వారు. ఇప్పడు అమూల్‌ డెయిరీ వల్ల ఎక్కువ డబ్బు వస్తుంది. ఇన్నాళ్లూ ప్రైవేట్‌ డెయిరీల వల్ల ఇంత మోసపోయామా అనుకున్నాం. జగనన్నా.. మీరు చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేం. ఎప్పటికీ మీ పాలనే కావాలి. పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. – రత్నమ్మ, కాలసముద్రం, కదిరి మండలం, అనంతపురం జిల్లా

మరిన్ని వార్తలు