హస్తకళల అభివృద్ధికి సాక్షి.. లేపాక్షి

21 Sep, 2022 10:31 IST|Sakshi

కడప కల్చరల్‌ : లేపాక్షి హస్తకళల ఎంపోరియంలు స్థానిక హస్త కళాకారులు రూపొందించే ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నాయి.. దీంతో కళాకారులు ఉత్సాహంగా, మరింత కళాత్మకమైన వస్తువులను రూపొందిస్తున్నారు. తాము ఆర్థికంగా బాగుపడే అవకాశాలు లేపాక్షి ద్వారా వస్తుండడంతో మరికొన్ని షోరూంలు కావాలని కోరుతున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బడిగించల విజయలక్ష్మి మన జిల్లా వాసి కావడంతో ప్రత్యేక శ్రద్ధతో మన జిల్లాలో గండికోట, జమ్మలమడుగులలో నూతన షోరూంలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు.   డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రమంతటా లేపాక్షి ఎంపోరియంలు కళకళలాడాయి. స్థానిక చేతి వృత్తుల కళాకారుల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం పుంజుకోవడంతో మరిన్ని షోరూంలు అవసరం అయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని జమ్మలమడుగుకు చెందిన బడిగించల విజయలక్ష్మి రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ లేపాక్షి ఎంపోరియంలను విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. ప్రత్యేకించి కడప నగరంలో ప్రస్తుతం కోటిరెడ్డిసర్కిల్‌లో ఉన్న లేపాక్షి ఎంపోరియంతోపాటు కొత్తగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటలో కూడా లేపాక్షి విక్రయశాలను ఏర్పాటు చేస్తున్నారు. 

అమ్మకాలపై ఆశలు 
గ్రాండ్‌ క్యానియన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరున్న ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోంది. ఇప్పటికే గండికోటలో వీకెండ్స్‌లో పర్యాటకుల సందడి బాగా పెరిగింది. ఈ దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో గండికోటకు అంతర్జాతీయంగా ఖ్యాతి కల్పించేందుకు అక్కడ 1400 ఎకరాల భూమిని సేకరించి అందులోని కొంతభాగంలో ఒబెరాయ్‌ స్టార్‌ హోటల్, విల్లాలు నిర్మించనున్నారు. దీంతో భవిష్యత్తులో గండికోటకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ దశలో అక్కడ మన ప్రాంతంలోని శెట్టిగుంట కొయ్య»ొమ్మలు, వనిపెంట ఇత్తడి సామగ్రి, కళాకృతులు, మాధవరం నేత చీరలతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల హస్త కళారూపాలతో లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేస్తే మంచి మార్కెటింగ్‌ సౌకర్యం ఉంటుందని ఆయా వర్గాల నిపుణులు అంచనా వేశారు. హస్తకళల కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇటీవల సంబంధిత అధికారులను కలిసి వైఎస్సార్‌ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతూ వినతిపత్రాన్ని సమరి్పంచారు. ఈ క్రమంలో గండికోటలోని కోట సమీపంలో 50 సెంట్ల స్థలం లేపాక్షి ఎంపోరియంకు కేటాయించారు. ఇటీవల సంబంధిత అధికారులతో కలిసి చైర్మన్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించి భవన నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో షోరూం, పై భాగంలో క్రాఫ్ట్‌  డెవలప్‌మెంట్‌ సెంటర్, కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.  

జమ్మలమడుగులో..  
గండికోటతోపాటు జమ్మలమడుగులో కూడా లేపాక్షి ఎంపోరియం ఏర్పాటు కానుంది. తన సొంత నియోజకవర్గం కావడంతో స్థానిక ప్రముఖులు, చేనేత సంఘ నాయకుడు చంద్రమౌళి సహకారంతో చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి జమ్మలమడుగులో లేపాక్షి ఏర్పాటు విషయంలో పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా అక్కడ ఇటీవలే ఖాళీ అయిన సచివాలయ భవనాన్ని లేపాక్షి ఎంపోరియం ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా షోరూంతోపాటు క్రాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ లేదా కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కడప నగరంలో గల లేపాక్షి ఎంపోరియం ప్రస్తుతం కేవలం షోరూంతోనే నడుస్తోంది. దీన్ని విస్తృతం చేసేందుకు తొలి అంతస్తు నిర్మించేందుకు కూడా చైర్‌పర్సన్‌ ప్రణాళికలు పంపారు. వీటికి సంబంధించిన తుది ఫైళ్లు కూడా ముఖ్యమంత్రి పేషీకి చేర్చినట్లు మంగళవారం చైర్‌పర్సన్‌ బడిగించల విజయలక్ష్మి తెలిపారు.   

ఇంకా.. జిల్లాలోని ఒంటిమిట్టలో కూడా లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేసేందుకు చైర్మన్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలయంగా గుర్తింపు పొందాక ఒంటిమిట్టకు వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ఇలాంటి దశలో అక్కడ లేపాక్షి ఎంపోరియం ఏర్పాటు చేస్తే హస్తకళా రూపాలకు మంచి డిమాండ్‌ ఉంటుందని, మార్కెటింగ్‌ సౌకర్యం పెరుగుతుందని, దీంతో జిల్లాలోని హస్తకళాకారుల ఉత్పత్తులతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కళారూపాలకు డిమాండ్‌ ఏర్పడగలదని చైర్మన్‌ ఆశిస్తున్నారు. 

హస్తకళాకారులకు చేయూత 
మన జిల్లాలో శెట్టిగుంట, వనిపెంటతోపాటు జమ్మలమడుగు, మాధవరం లాంటి చేనేత వ్రస్తాల తయారీ కేంద్రాలు ఉన్నాయి. కడప నగరంలోని లేపాక్షి ఎంపోరియంలో కళారూపాలకు మంచి డిమాండ్‌ ఉంది. లేపాక్షి స్టాల్స్‌ జిల్లాలో మరిన్ని ఏర్పాటైతే హస్త కళాకారుల ఉత్పత్తులకు చేయూతనిచ్చినట్లవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో జిల్లాలోని గండికోట, జమ్మలమడుగులలో లేపాక్షి ఎంపోరియంలు ఏర్పాటు చేయడంతోపాటు కడప స్టాల్‌ను ఆధునీకరించనున్నాం.   
 – బడిగించల విజయలక్ష్మి
చైర్‌పర్సన్, ఏపీ హస్తకళల కార్పొరేషన్‌ 

మరిన్ని వార్తలు