వైద్య ఆరోగ్యశాఖలో 10,865 పోస్టుల భర్తీకి చర్యలు

18 Nov, 2021 04:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని రీతిలో వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు పెద్ద ఎత్తున కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 10,865 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 7,390, కొత్తగా సృష్టించినవి 3,475 ఉన్నాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ), ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ (ఏపీవీవీపీ), డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. డీఎంఈ పరిధిలోని 15 వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న 35 ఆస్పత్రుల్లో 1,952 పోస్టులు ఖాళీగా ఉండగా 2,190 పోస్టులను సృష్టించారు.

ఏపీవీవీపీ పరిధిలో 2,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలో 2,918 పోస్టులు ఖాళీగా ఉండగా 1,285 పోస్టులను సృష్టించారు. బోధనాస్పత్రుల్లోని చాలా విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలు అమలు చేయడం ఇబ్బందిగా ఉంటోంది. బోధనాస్పత్రుల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ విభాగాలకు సంబంధించి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సృష్టించిన పోస్టులను కూడా ఒకేసారి భర్తీ చేయనున్నారు.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో భాగంగా 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌లు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌.. ఇలా మొత్తం 12 మంది ఉండాలని నిర్ణయించింది. అదేవిధంగా 560 వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఒక్కో ఫార్మసిస్ట్‌లు ఉండేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి ఆయా విభాగాలు, జిల్లా ఎంపిక కమిటీలు నోటిఫికేషన్లు ఇవ్వనున్నాయి. 

మరిన్ని వార్తలు