చెత్త సమస్యను చిత్తు చేసేలా ‘స్వచ్ఛ సంకల్పం’

11 Jul, 2021 03:49 IST|Sakshi

డంపింగ్‌ యార్డుల అవసరం లేదు.. చెత్తను తగులబెట్టే పనీ ఉండదు

గ్రామాల్లో పోగయ్యే పొడి చెత్తంతా ఇక ఫ్యాక్టరీలకే

నాలుగు ప్రాంతాల్లో నాలుగు ఫ్యాక్టరీల ఎంపిక

కార్యాచరణ సిద్ధం చేసిన పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌

సాక్షి, అమరావతి: గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్త సమస్యను చిత్తు చేసే చర్యలు త్వరలో మొదలు కాబోతున్నాయి. పట్టణాల్లో మాదిరిగా గ్రామాల్లోనూ ప్రతి ఇంటినుంచీ చెత్తను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట వంద రోజుల ప్రణాళిక రూపొందించింది. తద్వారా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించేలా గ్రామాల్లో ప్రతి 250 ఇళ్లకు ఒకరిని నియమించడంతో పాటు చెత్త సేకరణకు ఆటోలు, రిక్షాలు వంటివి ప్రభుత్వమే గ్రామ పంచాయతీలకు సమకూర్చనుంది. అలా సేకరించిన చెత్తను ఎక్కడికక్కడ ప్రాసెసింగ్‌ చేయటం ద్వారా వర్మీ కంపోస్టు తయారు చేస్తారు. ప్రాసెసింగ్‌ ద్వారా వేరు చేసిన పొడి చెత్తను ఫ్యాక్టరీలకు వెళ్లనుంది. ఇందుకు పంచాయతీరాజ్‌ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ కార్యాచరణ సిద్ధం చేశాయి. 

గ్రామాల్లో రోజుకు 12,250 టన్నుల చెత్త
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తి రోజుకు సగటున 300 గ్రాముల చెత్తను పారబోస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఈ విధంగా కేవలం గ్రామీణ ప్రాంతాల నుంచే రోజుకు 500 లారీల్లో పట్టేంతగా 12,250 టన్నుల చెత్త పోగవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై చెత్తను శుభ్రం చేయడం గ్రామ పంచాయతీలకు, పంచాయతీరాజ్‌ శాఖకు, ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. గ్రామాల్లో పోగయిన చెత్తను రోడ్లకు ఇరువైపులా కుప్పలుగా పోసి తగులబెట్టడం వల్ల వచ్చే పొగ, వాసనతో స్థానిక గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ఓ శాస్త్రీయమైన, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. కనీసం చెత్తను తగులబెట్టే అవసరం లేకుండా నిత్యం పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడే ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

12 శాతం చెత్తతోనే అసలు సమస్య
గ్రామీణ ప్రాంతాల్లో పోగయ్యే మొత్తం చెత్తలో 65 శాతం తడి చెత్త రూపంలో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వర్మీ కంపోస్టు తయారు చేయాలని నిర్ణయించారు. మరో 12 శాతం పొడి చెత్త (గాజు పెంకులు, కార్డు బోర్డు, ఒక రకమైన ప్లాస్టిక్‌) వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి సమస్యలొస్తున్నాయి. దీనిని విద్యుత్‌ ఉత్పత్తి, సిమెంట్‌ ఫ్యాక్టరీల్లో మండించడానికి ఉపయోగించేలా ప్రాథమిక కార్యాచరణ రూపొందించారు. మిగిలిన 23 శాతం చెత్తను రీసైక్లింగ్‌కు ఉపయోగించాలని ఆలోచన చేస్తున్నారు. 

నాలుగు ఫ్యాక్టరీలు ఎంపిక
పొడి చెత్తతో గ్రామ స్థాయిలోనే వర్మీ కంపోస్టు తయారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గ్రామంలో ఒక షెడ్‌ చొప్పున ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 9 వేలకు పైగా గ్రామాల్లో వీటి నిర్మాణం పూర్తయింది. రీ సైక్లింగ్‌కు ఉపయోగించే చెత్తను ఆ షెడ్లలోనే వేరుచేసి అక్కడే విక్రయిస్తారు. మిగిలిన 12 శాతం చెత్తను మండించేందుకు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో నాలుగు ఫ్యాక్టరీలను ఎంపిక చేయనున్నారు.   

మరిన్ని వార్తలు