రఘురామకృష్ణరాజు కేసు: కొట్టారన్నది కట్టు కథే

21 May, 2021 09:43 IST|Sakshi

కాలి నరాల సమస్యతోనే రఘురామకు కాళ్ల వాపు

నివేదికలో పేర్కొన్న మెడికల్‌ బోర్డు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుతాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నిన కేసులో అరెస్టై జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తనను పోలీసులు కొట్టినట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టమవుతోంది. బెయిల్‌ రాకపోవడం, కుట్రదారులను నిగ్గు తేల్చేందుకు క్షుణ్నంగా విచారణ జరుగుతుండటంతోనే ఆయన ఈ ఎత్తుగడ వేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కాలి నరాల సమస్య...
ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలేవీ లేవని నిర్థారిస్తూ హైకోర్టు నియమించిన మెడికల్‌ బోర్డు ఇప్పటికే న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. రఘురామకృష్ణరాజు శరీరంపై తాము గుర్తించిన అంశాలేవీ ఆయన ఆరోపిస్తున్నట్లుగా కొట్టడం వల్ల ఏర్పడినవి కావని కూడా బోర్డు నివేదిక స్పష్టం చేసింది. ఆయన రెండు పాదాల్లో నీరు చేరడం (ఎడిమా)తో వాచినట్లు వైద్యులు నిర్ధారించారు. అందువల్లే ఆయన అరికాళ్లు రంగు మారాయని పేర్కొన్నారు.

మరోవైపు ఆయనకు ముందు నుంచీ ఉన్న నరాల సంబంధిత సమస్యతో కాలి పిక్కల వద్ద నరాల పనితీరులో ఇబ్బందులు తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. అదే విషయాన్ని నివేదికలో పేర్కొన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, కిడ్నీ వ్యాధి నిపుణులు ఆయన్ను పరిశీలించారని బోర్డు నివేదికలో స్పష్టం చేసింది. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని కూడా  తేల్చి చెప్పింది.

చదవండి: చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారమే రఘురామ డ్రామాలు: అంబటి 
రఘురామకృష్ణరాజు తీరుపై మండిపడ్డ క్షత్రియ నేతలు

మరిన్ని వార్తలు