నర్సులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం  

26 Aug, 2022 03:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: నర్సులకు శిక్షణ ఇచ్చే స్టేట్‌ మిడ్‌వైఫరీ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎస్‌ఎంఐటీ)లను రాష్ట్రంలోని 10 ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో దశలవారీగా ప్రారంభించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఇప్పటికే తిరుపతి, గుంటూరు నర్సింగ్‌ కాలేజీల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాతా, శిశు సంరక్షణ, ప్రసూతి సేవలను నర్సుల ద్వారా అందించే ఉద్దేశంతో.. వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ‘పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ఇన్‌ నర్సింగ్‌ ప్రాక్టీషనర్‌ ఇన్‌ మిడ్‌వైఫరీ’ కోర్సును కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నర్స్‌ ప్రాక్టీషనర్‌ ఇన్‌ మిడ్‌వైఫరీ(ఎన్‌పీఎం) కోర్సుకు సంబంధించి పలు మార్గదర్శకాలతో వైద్య శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది. 18 నెలల పాటు నర్సులకు మిడ్‌వైఫరీ శిక్షణ ఇస్తారు. ఇందులో ఏడాది పాటు శిక్షణ, 6 నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. వీరికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి ఎస్‌ఎంఐటీలో ఆరుగురు మిడ్‌వైఫరీ ఎడ్యుకేటర్‌లు ఉంటారు. ఎన్‌పీఎం శిక్షణ పొందడానికి ఇన్‌సర్వీస్‌లో ఉన్న శాశ్వత, కాంట్రాక్ట్‌ నర్సులు అర్హులు. 45 ఏళ్లలోపు వయసు, జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత, ప్రసవాలు నిర్వహించడంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఈ కోర్సు వ్యవహారాలను డీఎంఈ పర్యవేక్షిస్తారు. శిక్షణ అనంతరం నర్సులకు సర్టిఫికెట్‌లు కూడా ఇస్తారు.   

మరిన్ని వార్తలు