ఆరుగురు డాక్టర్లతో బృంద వైద్యం 

20 May, 2021 04:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బ్లాక్‌ ఫంగస్‌ ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్స్‌పై వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు  

సాక్షి, అమరావతి:  బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన వారిని ఆరుగురు వైద్యుల బృందం పర్యవేక్షించాల్సి ఉంటుంది. జనరల్‌ ఫిజీషియన్, ఈఎన్‌టీ సర్జన్, ఆఫ్తాల్మాలజీ, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్, హెడ్‌–అండ్‌ నెక్‌ సర్జన్‌లతో కూడిన బృందం క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్స్‌పై ఆదేశాలు జారీచేసింది. నిపుణుల బృందం పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ ఈ మార్గదర్శకాలిచి్చంది. నాసికా మార్గం ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ వేగంగా వ్యాపించి రక్త నాళాలను మూసివేస్తుంది. నియంత్రణలో లేని మధుమేహం, స్టెరాయిడ్స్, రోగ నిరోధక మందులు ఎక్కువగా వాడటం, ఎక్కువ కాలం ఆక్సిజన్‌ థెరపీలో, వెంటిలేటర్‌పై ఉండటం వల్ల జబ్బు సోకే అవకాశం ఉంటుంది. ఐసీయూలోని గొట్టాలను సరిగా శుభ్రపరచకపోవడం వల్ల కూడా ఫంగస్‌ వస్తుంది.  

నిర్ధారణ..  ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయాలి. ముక్కు ఎండోస్కొపీ ద్వారా ఈ జబ్బును గుర్తించవచ్చు. సీటీ స్కాన్‌ ద్వారా ముక్కులో గాలి గదుల్లో ఇన్ఫెక్షన్‌ తెలుసుకోవచ్చు. మెదడుకు, కంటికి సోకిందో లేదో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చు.  
నివారణా మార్గాలు.. స్టెరాయిడ్లను అవసరం మేరకు తగిన మోతాదులో మాత్రమే వాడాలి. ఆక్సిజన్‌ ఇచ్చే సమయంలో శుభ్రమైన నీటిని వాడాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ బెటడిన్‌తో నోటిని పుక్కిలించాలి.   

మరిన్ని వార్తలు