కరోనా టెస్ట్‌లు పెంపు.. రెండు రోజుల్లో 5,465 పరీక్షలు.. ఒక్కరికే ‘పాజిటివ్‌’

23 Dec, 2022 04:25 IST|Sakshi

అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం

కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచిన వైద్య శాఖ

సాక్షి, అమరావతి: వివిధ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను వైద్య, ఆరోగ్య శాఖ పెంచింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 2,793 పరీక్షలు చేయగా.. విశాఖలో ఒక్క కేసు వెలుగు చూసింది. గురువారం 2,672 పరీక్షలు చేయగా.. అన్నీ ‘నెగిటివ్‌’ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు యాక్టివ్‌ కేసులే ఉన్నాయి.

ఈ ముగ్గురు కూడా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ ఒమిక్రాన్‌ వేరియంట్‌వే. ప్రభుత్వం వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని స్థాయిల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలను అందుబాటులో ఉంచింది. విలేజ్‌ క్లినిక్స్‌కు పెద్ద సంఖ్యలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లను వైద్య శాఖ సరఫరా చేస్తోంది.   

జాగ్రత్తలు పాటిస్తే చాలు.. 
కరోనా వ్యాప్తిని అధిగమించడానికి ప్రజలంతా మళ్లీ మాస్క్‌లు ధరించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. త­గిన జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడంతో పా­టు శానిటైజర్, భౌతిక దూరాన్ని పాటించాలని.. స­మూహాలకు దూరంగా ఉండాలని కోరింది. ప్రతి ఒ­క్కరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని సూచించింది. 

కోవిడ్‌ ప్రొటోకాల్‌ అమలుకు ఆదేశాలు రాలేదు.. 
విమానాశ్రయం(గన్నవరం): కోవిడ్‌ కొత్త వేరియంట్‌ కేసుల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలిస్తే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అమలు చేస్తామని ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం షార్జా, కువైట్‌ నుంచి వారానికి మూడు సర్వీస్‌లు విజయవాడ ఎయిర్‌పోర్టుకు వస్తున్నాయని చెప్పారు.

కోవిడ్‌ ప్రోటోకాల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ పంపిన లేఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ద్వారా తమకు చేరిందని తెలిపారు. కొత్త వేరియంట్‌ దృష్ట్యా అంతర్జాతీయ ప్రయాణికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ వినియోగాన్ని తప్పనిసరి చేస్తామని చెప్పారు.   

మరిన్ని వార్తలు