చంద్రబాబు సర్కారులో వైద్య పరికరాల స్కామ్‌

2 Apr, 2021 02:53 IST|Sakshi

 2015లో రూ.450 కోట్లతో టెండరు ఖరారు 

ఆపై నిబంధనలకు విరుద్ధంగా పొడిగింపు

రూ.300 కోట్లు విలువ చేసే వాటిని రూ.500 కోట్లుగా చూపిన వైనం

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణ కాంట్రాక్టులో జరిగిన భారీ స్కామ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. తూర్పుగోదావరి జిల్లా అవిడి గ్రామానికి చెందిన ఇందుకూరి వెంకటరామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 420, 406, 477 కింద 07/2021 నంబర్‌తో గురువారం సీఐడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణకు ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా టెండర్లు పిలిచింది.

బెంగళూరుకు చెందిన టీబీఎస్‌ ఇండియన్‌ టెలీ మాటిక్, బయో మెడికల్‌ సర్వీసెస్‌ అనే సంస్థకు టెండరు ఖరారు చేసింది. కాగా, ఈ టెండరు ఖరారులో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారని రామరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడాదికి రూ.450 కోట్ల భారీ మొత్తానికి టెండరు కట్టబెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని పొడిగించారని తెలిపారు. టెండరు దక్కించుకున్న సంస్థ ఉపకరణాల విలువను మార్కెట్‌ ధరల కంటే ఎన్నో రెట్లు అమాంతం పెంచేసి మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని 

వివరాలు ఇలా ఉన్నాయి..
 వెంటిలేటర్‌ రూ.7.10 లక్షలుంటే దాన్ని రూ.11 లక్షలుగా చూపించారు. ఇలా 159 వెంటిలేటర్ల సరఫరా ద్వారా రూ.17.05 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. రూ.840 విలువ చేసే ఒక్కో గ్లూకో మీటరును రూ.5.08 లక్షలుగా చూపించారు. 12 గ్లూకో మీటర్ల కొనుగోలులో రూ.60.96 లక్షల అవినీతికి పాల్పడ్డారు.  రూ.1.7 కోట్ల విలువ చేసే ఎమ్మారై మిషన్‌ (కర్నూలు ఆసుపత్రికి)ను రూ.3.50 కోట్లుగా చూపించారు.   
► మొత్తంగా రూ.300 కోట్లు విలువ చేసే ఉపకరణాల విలువను రూ.500 కోట్లుగా చూపించారు. రూ.200 కోట్ల మేర చేతులు మారాయి. పైగా 2016–17, 2017–18లో నిర్వహణ వ్యయంగా అడ్డగోలుగా రూ.24.90 కోట్లు కాంట్రాక్ట్‌ సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు