వైద్య విద్య కొన్నాళ్లు ఆన్‌లైన్‌లోనే

7 Oct, 2020 04:27 IST|Sakshi

కేంద్రం మార్గదర్శకాలు వచ్చాకే తరగతి గదుల్లో క్లాసులు

ఎక్స్‌టర్నల్‌ పరీక్షలు ఆన్‌లైన్‌లోనే

కొత్త ఫీజులపై ఫీజుల నియంత్రణ కమిటీ కసరత్తు 

సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థులకు మరికొద్ది రోజులు ఆన్‌లైన్‌ తరగతులే జరగనున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, డీమ్డ్‌ వర్సిటీలు ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నాయి. వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా కరోనా నేపథ్యంలో ఇంతకంటే మార్గం లేదన్న న్యాయస్థానం మరికొద్ది రోజులు ఇదే విధానంలో నిర్వహించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే వరకు తరగతి గదుల్లో క్లాసులు నిర్వహించలేని పరిస్థితి ఉందని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎగ్జామినర్లు వచ్చి నిర్వహించే ఎక్స్‌టర్నల్‌ పరీక్షలను కూడా ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని నిర్ణయించారు. క్లినికల్‌ తరగతులకు సంబంధించి కోవిడ్‌ పరిస్థితులు చక్కబడ్డాక ఆలోచిస్తామని అధికారులు చెబుతున్నారు.

త్వరలోనే హైలెవెల్‌ కమిటీ నివేదిక
ఏటా ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల సమయంలో నెలకొంటున్న వివాదాలను పరిష్కరించి పారదర్శకంగా ప్రవేశాలు నిర్వహించేందుకు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ కన్వీనర్‌గా ఓ కమిటీని నియమించింది. ఇటీవల సమావేశమై పలు అంశాలపై చర్చించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఫీజులపై కసరత్తు
ఈ ఏడాది ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల నాటికి సవరించిన ఫీజులను అమలు చేసేలా ఫీజుల నియంత్రణ కమిటీ కసరత్తు చేసింది. త్వరలోనే ఫీజులు నిర్ణయించి ప్రభుత్వానికి సూచించనుంది. అనంతరం జీవో వెలువడనుంది. జీవో జారీ అయ్యాకే ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు మొదలవుతాయి. ఫీజులు ఓ కొలిక్కి వస్తే, మిగతా ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే ఫీజులు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

పారదర్శకంగా ప్రవేశాలు
త్వరలో చేపట్టనున్న ఎంబీబీఎస్, బీడీఎస్‌ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతాయి. హైలెవెల్‌ కమిటీ నివేదిక, ఫీజులపై జీవోలు రాగానే అడ్మిషన్లకు సంబంధించి  రూపకల్పన చేస్తాం. ఇందుకోసం అన్ని చర్యలు చేపడుతున్నాం. 
    – డా.శంకర్, రిజిస్ట్రార్, ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ  

మరిన్ని వార్తలు