ప్రాణాల మీదకు.. 'సొంత వైద్యం'.. నష్టాలే అధికం!

16 May, 2021 05:35 IST|Sakshi

శరీరంలో డ్రగ్‌ రెసిస్టెన్స్‌ పెరిగితే  ప్రమాదమంటున్న నిపుణులు

దీర్ఘకాలిక రోగులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని సూచన

కడపకు చెందిన శేఖర్‌కు 55 ఏళ్లు. కొన్ని సంవత్సరాలుగా షుగర్‌తో బాధపడుతూ మందులు వాడుతున్నాడు. కాగా రెండు వారాల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వైద్యుల సూచన తీసుకోకుండా ఎవరో స్నేహితుల మాటలు, సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మి వేరే ఎవరికో ఇచ్చిన ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందులు వాడాడు. అందులో స్టెరాయిడ్స్‌ ఉండటంతో షుగర్‌ లెవెల్స్‌ విపరీతంగా పెరిగిపోయి పరిస్థితి విషమంగా మారింది. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన వ్యక్తి ఆసుపత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందాల్సి వచ్చింది. 

కడప కార్పొరేషన్‌/రూరల్‌: ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌ గ్రూపుల్లో తరచూ ఫలానా మందులు వాడితే కరోనాకు ప్రివెంటివ్‌గా పనిచేస్తాయని ప్రచారం జరగడం చూస్తున్నాం. ఒకరికి కరోనా వచ్చినప్పుడు వాడిన ప్రిస్క్రిప్షన్‌ను మరొకరు పాజిటివ్‌ రాగానే సొంతంగా వాడేస్తున్నారు. అలాంటి వారిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏ మందు అయినా  అవసరం మేరకే వాడాలి. అంతేగానీ ప్రివెంటివ్‌ పేరుతో  విచ్చలవిడిగా వాడితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా మందులు వాడటం డద్వారా శరీరంలో డ్రగ్‌ రెసిస్టెన్స్‌ పెరిగి అవసరమైనప్పుడు ఆ మందులు పనిచేయకుండా పోతాయని చెబుతున్నారు. 

అపోహలు....సొంత వైద్యాలు
మొదటి వేవ్‌ సమయంలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్, మీజిల్స్‌–రూబెల్లా వ్యాక్సిన్, పర్‌మెక్టిన్, హెచ్‌ఐవీ బాధితులకు వాడే లోపినావీర్‌ 50, రిటోనావీర్‌200 వంటి మందులను వైద్యరంగానికి చెందిన వారు సైతం వాడారు. అప్పట్లో వ్యాక్సిన్‌ లేదు కాబట్టి ముందస్తుగా వాడారు. కానీ నేడు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కొందరు వాటిని వాడుతున్నారు. ఇక నాళాల్లో బ్లాక్స్‌కు అస్పిరిన్‌ వాడితే సరిపోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఎక్కువ మంది ఆస్పిరిన్, ఎకోస్ప్రిన్‌ మందులను వాడేస్తున్నారు. వాటితోపాటు వైరల్‌ జ్వరాలు వచ్చినప్పుడు వాడే ఫాబి ఫ్లూ మందులను ఎక్కువగా వాడుతున్నారు. ఇక విటమిన్‌ సీ, డీ, జింక్‌ మందులను రెగ్యులర్‌గా వేసే వాళ్లున్నారు. 

ఒకరి ప్రిస్క్రిప్షన్‌ ...మరొకరు
కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగికి వైద్యులు రాసిన మందులను తమ స్నేహితులు, సన్నిహితులకు పాజిటివ్‌ వచ్చినప్పుడు వైద్యుల సూచన లేకుండానే వాడేస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా ఆ మందుల వివరాలు తీసుకొని మందుల షాపుల్లో కొనుగోలు చేసి వాడుతున్నారు. వాస్తవంగా వ్యక్తి ఆరోగ్య స్థితి, దీర్ఘకాలిక వ్యాధులు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని మందులు వాడాల్సి ఉంది. అలాకాకుండా మధుమేహం ఉన్నవారు సైతం స్టెరాయిడ్స్‌ వాడుతుండటంతో వారి పరిస్థితి విషమిస్తోంది. అంతేకాకుడా కొన్ని రకాల మందులతో డ్రగ్‌ ఎలర్జీలకు సైతం గురవుతున్నారు. 

నష్టాలే ఎక్కువ
యాంటీ వైరల్‌ డ్రగ్‌ను వైరస్‌ సోకినప్పుడు మాత్రమే వాడాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే వెయిట్‌ లాస్, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అజిత్రోమైసిన్‌ వంటి యాంటీ బయోటిక్‌ మందులు ఎక్కువగా వాడితే గుండెపై ప్రభావం చూపుతాయని వైద్యులు అంటున్నారు. ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం  ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. యాంటీ బయోటిక్స్‌ ఎక్కువగా వాడటం ద్వారా శరీరంలో డ్రగ్‌ రెసిస్టెన్నీ పెరిగి జబ్బు చేసినప్పుడు ఆ మందులు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు.  

సొంత వైద్యం అనర్థాలకు దారితీస్తుంది
ఏ వ్యాధికైనా సొంత వైద్యం  అనర్థాలకు దారి తీస్తుంది. కరోనాకు ఇది మరింతగా ప్రమాదకరం. శరీరంలో కరోనా వైరస్‌ ప్రవేశించిన నాలుగైదు రోజులు ఎంతో కీలకం. ఈ దశలో క్వాలిఫైడ్‌ వైద్యుల పర్యవేక్షణలోనే వైద్య చికిత్సలు పొందాలి. సొంత వైద్యం వల్ల చాలామంది ఎక్కువ డోస్‌ ఉన్న మందులు వాడుతుంటారు. అందులో స్టెరాయిడ్‌ ఎక్కువ శాతం ఉంటుంది.

దీంతో ఇతర మందులు వేసుకున్నా పనిచేయని పరిస్థితి ఉంటుంది. ఈ దశలోనే   కరోనాకు సంబంధించిన 25 శాతానికిపైగా మరణాలు సంభవిస్తున్నాయి. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్యం పొందాలి. కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టే గుణం ఉండటంతో ఆస్పిరిన్, ఎకోస్ప్రిన్‌ మందులు ఎక్కువగా వాడుతున్నారు. అయితే బ్రెయిన్‌లో గాయాలు ఉన్నవారు, రక్తం  గడ్డకట్టే గుణం కోల్పోయిన వారు ఈ మందులు వాడకూడదు. కరోనా నుంచి రక్షించేది టీకా మాత్రమే. కరోనా పట్ల అప్రమత్తత, అవగాహన ఎంతో అవసరం. 
–డా. అనిల్‌ కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి.  

మరిన్ని వార్తలు