స్నానాలొద్దు.. నీళ్లు చల్లుకుంటే చాలు

1 Nov, 2020 03:35 IST|Sakshi

తుంగభద్ర పుష్కరాలపై వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు

సాక్షి, అమరావతి: భక్తుల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని కరోనా పరిస్థితుల్లోనూ తుంగభద్ర పుష్కరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఆ దిశగా కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే వైరస్‌ వ్యాప్తికి అవకాశం లేకుండా పుణ్య స్నానాలపై నియంత్రణ చర్యలు చేపట్టనుంది. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 1 వరకు తుంగభద్ర నదికి ఈ సారి పుష్కరాలు రానున్నాయి. ఇది కృష్ణా నదికి ఉప నది. కర్ణాటకలో అత్యధిక భాగం, మిగతా ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రవహిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల మీదుగా కృష్ణాలో కలుస్తుంది. పుష్కరాల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతం వెంట ఉన్న 16 ప్రముఖ ఆలయాలలో రూ.కోటి ఖర్చుతో ఆధునికీకరణ, అలంకరణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు.

► పుష్కరాలలో భక్తుల పుణ్య స్నానాల నిర్వహణలో నియంత్రణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ అనంతరం దేశ వ్యాప్తంగా స్విమ్మింగ్‌ పూల్స్‌పై ఇప్పటికీ ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ తుంగభద్ర పుష్కరాలపై ప్రత్యేక నిబంధనావళితో ఉత్తర్వులు జారీ చేసింది. 
► ప్రత్యేక ఘాట్ల ఏర్పాటుకు తగిన చర్యలు చేపడుతూనే వైరస్‌ వ్యాప్తికి అవకాశం లేకుండా భక్తులు పుష్కర రోజుల్లో ఇంటి వద్దనే స్నానాలు చేసి, నది వద్ద కేవలం పవిత్ర జలాలను నెత్తిన చల్లు కోవాలని (ప్రోక్షణ) విస్త్రత స్థాయిలో ప్రచారం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. 
► భక్తుల సెంటిమెంట్‌ దృష్ట్యా పితృ దేవతలకు పిండ ప్రదానం నిర్వహించడం వంటి కార్యక్రమాలను ఏకాంతంగా జరుపుకునేందుకు పూర్తి స్థాయిలో అనుమతి ఇస్తారు. 
► ఇందుకోసం 16 దేవాలయాల పరిధిలో ప్రత్యేక షెడ్లు నిర్మిస్తున్నారు. 600 మంది పురోహితులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. 
► వైరస్‌ లక్షణాల భక్తులు ఎవరైనా దర్శనం కోసం వచ్చినట్టు గుర్తిస్తే, ఆ భక్తుడే స్వచ్ఛందంగా తిరిగి వెనక్కు వెళ్లేలా నచ్చ జెప్పాలని దేవదాయ శాఖ కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించింది. 

మరిన్ని వార్తలు