ఎంఎల్‌టీ చదువు.. ఉద్యోగం పట్టు

6 Jul, 2022 21:59 IST|Sakshi

నెల్లిమర్ల: పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్‌ తదితర ఉన్నత విద్యనభ్యసించినా ఉద్యోగం దొరకని రోజులివి. ప్రభుత్వ ఉద్యోగం లభించాలంటే అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి, లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రైవేట్‌ ఉద్యోగాలకు సైతం సిఫారసులు తెచ్చుకోవాల్సిన దుస్థితి. అయితే పదోతరగతి అర్హతతో రెండేళ్ల పాటు చదివే ఆ కోర్సుకు మాత్రం ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.  ఇంటర్‌ మీడియట్‌ స్థాయిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ కోర్సుతో ఉన్నత చదువులకు సైతం అవకాశం ఉంటుందంటున్నారు. అదే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అందుబాటులో నున్న మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌(ఎంఎల్‌టీ) కోర్సు. 

అందుబాటులో ఉన్న సీట్లు
ఉమ్మడి జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్‌కోట, సాలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు అందుబాటులో ఉంది. ఒక్కో కళాశాలలో 40 చొప్పున సీట్లు  ఉన్నాయి. ఈ నెల 20వ తేదీవరకు ప్రవేశాలకు అవకాశముంది. ఇవి కాకండా మరో 18 ప్రైవేట్‌ కళాశాలల్లో కూడా ఎంఎల్‌టీ కోర్సు అందుబాటులో ఉంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ   కోర్సులో చేరడానికి అవకాశముంది. కోర్సులో చేరే విద్యార్థులు రెండేళ్ల పాటు చదవాల్సి ఉంటుంది. థియరీతో పాటు ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయి.  

ఉన్నత చదువులకు అవకాశం
ఇంటర్మీడియట్‌తో సమానమైన ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బీఎస్సీలో ఎంఎల్‌టీ చదవడానికి అవకాశముంది. అలాగే బీఎస్సీలో మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ,  బయో టెక్నాలజీ కోర్సులు చదవవచ్చు. అంతేకాకుండా ఎంసెట్‌ ప్రవేశపరీక్ష రాయడానికి అవకాశముంటుంది. బీఎస్సీలో బీజెడ్‌సీ బ్రిడ్జి కోర్సుగా చదివే   వీలుంది. 

ఉద్యోగాలు పొందిన విద్యార్థులు వీరే
నెల్లిమర్ల సీకేఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివిన వి.భవాని ఎస్‌కోట మండలం పీఎం పాలెం పీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఉద్యోగం సాధించారు. కోరాడ ఉమామహేశ్వరరావు పూసపాటిరేగ మండలం గోవిందపురం పీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఎం శ్రీదేవి రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకులో, జె.ప్రణతి, ఎస్‌ భారతి, బి.అక్షిత, జె.శైలజ, బి.తేజసాయి, బి.అజయ్‌కుమార్‌ న్యూ లైఫ్‌ బ్లాడ్‌ బ్యాంకులోనూ ఉద్యోగాలు సాధించారు. ఈ కోర్సు చదివిన అందరూ ఏదో విధంగా   ప్రభుత్వ, ప్రైవేట్‌  ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మిగిలిన వారంతా స్వయంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకుని, స్వయం ఉపాధి పొందుతున్నారు.

ఉద్యోగం గ్యారంటీ
మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌(ఎంఎల్‌టీ) కోర్సుతో ఉద్యోగం కచ్చితంగా లభిస్తుంది. ప్రతిభ ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగాలు   సాధించవచ్చు. నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్‌.కోట, సాలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ గ్రూప్‌ అందుబాటులో ఉంది. వచ్చేనెల 20వ తేదీవరకు ప్రవేశాలకు అవకాశముంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలి.          
– మజ్జి ఆదినారాయణ, ఆర్‌ఐఓ

మరిన్ని వార్తలు