‘ఫ్యామిలీ డాక్టర్‌’తో ప్రజలకు వైద్యసేవలు చేరువ 

24 Sep, 2022 08:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: గ్రామీణ పేదలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని రూపొందించారని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన సముదాయంలో ఉన్న వైద్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్లకు ఇంటెన్సివ్‌ ట్రైనింగ్‌ నిర్వహించారు. వైద్య శాఖలోని వివిధ విభాగాల పనితీరు, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ విధానం, ఇతర ఆరోగ్య కార్యక్రమాలను కృష్ణబాబు వివరించారు.

గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం కోసం వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిసెంబర్‌ నాటికి పూర్తి స్థాయిలో విలేజ్‌ క్లినిక్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి క్లినిక్‌లో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, ఏఎన్‌ఎం, నలుగురు ఆశా వర్కర్‌లు పని చేస్తారని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో భాగంగా ప్రతి గ్రామాన్ని పీహెచ్‌సీ వైద్యుడు నెలలో రెండుసార్లు సందర్శిస్తారని తెలిపారు. గ్రామ స్థాయిలో నయం కాని ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తామన్నారు. ఈ బాధ్యతను విలేజ్‌ ఆరోగ్య మిత్ర చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు