లక్షణాలు లేనివారిలో హార్ట్‌ ఎటాక్‌ రిస్క్‌ ఎక్కువ.. ఈ పరీక్షలో స్కోర్‌ ఎక్కువగా ఉంటే!

18 Feb, 2022 06:32 IST|Sakshi

40 ఏళ్లు పైబడిన వారు చేయించుకోవచ్చు

ముందుగా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు

మందులు వాడి హార్ట్‌ ఎటాక్‌ను అరికట్టవచ్చు

కర్నూలు(హాస్పిటల్‌): మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లతో చిన్న వయస్సులోనే కొందరు గుండెపోటుకు గురై తనువు చాలిస్తున్నారు. కడుపునిండా తినడం వ్యాయామాలు చేయకపోవడం, కూర్చుని చేసే పనులు అధికంగా ఉండటం, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌ అధికంగా తీసుకోవడం తదితర కారణాలతో ఇటీవల గుండెజబ్బులు ఎక్కువయ్యాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ఓపీకి 200 నుంచి 250 మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారు.

ఇన్‌పేషంట్లుగా ప్రతి నెలా 350 నుంచి 400 మంది వరకు చికిత్స అందుకుంటున్నారు. పెద్దాసుపత్రిలో ప్రతిరోజూ 400 మందికి ఈసీజీ, 40 నుంచి 50 వరకు 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నంద్యాలలోని కార్డియాలజిస్టులలో ఒక్కొక్కరి వద్దకు ప్రతిరోజూ 20 నుంచి 50 మంది వరకు చికిత్స కోసం వెళ్తుంటారు. జిల్లా మొత్తంగా ప్రతిరోజూ 40 నుంచి 60 మందికి గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. 

లక్షణాలు లేనివారిలో రిస్క్‌ ఎక్కువ
గుండెజబ్బుకు సంబంధించి లాంటి లక్షణాలు లేని వారిలో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారి కోసం కరోనరి కాల్షియం స్కాన్‌ ఉపయోగ పడుతుంది. ఈ పరీక్షకు ఉపయోగించే పరికరం రక్తనాళాల్లో ఏర్పడ్డ అడ్డంకులను, నాళాల అంచులకు ఏర్పడ్డ ఫ్లేక్‌(ఫలకం)లను గుర్తిస్తుంది. గుండెలో కొలెస్ట్రాల్‌ లోడ్‌ ఏ లెవెల్‌లో ఉందో చెప్పేస్తుంది. కరోనరి ఆర్టరి కాల్షియం స్కోర్‌ను చూపిస్తుంది. దీని ద్వారా గుండె కాల్సిఫికేషన్‌(బోన్‌ డిపోజిషన్‌)ను అంచనా వేస్తుంది. ఈ నివేదిక ప్రకారం భవిష్యత్‌లో హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో కార్డియాలజిస్టు చెప్తారు. స్కోర్‌ ఎక్కువగా ఉంటే వైద్యుల సూచనలతో మందులు వాడి, భవిష్యత్‌లో హార్ట్‌ ఎటాక్‌ను నివారించుకోవచ్చు. 

జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి
కరోనరి కాల్షియం స్కాన్‌ అందరికీ అవసరం లేదు. 40 ఏళ్లు పైబడిన వారికి రిస్క్‌ ఫాక్టర్స్‌ అధికంగా ఉంటే ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో మొదటి నుంచి చివరి వరకు చేసే ప్రక్రియకు ఐదు నుంచి పది నిమిషాల వరకు సమయం పడుతుంది. ఈ పరీక్ష ఐదేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. స్కానింగ్‌ రిపోర్ట్‌ను బట్టి వైద్యులు రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ గురించి స్పష్టంగా చెప్పగలగుతారు. స్కోర్‌ 400లకు పైగా ఉంటే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో మందులు వాడాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. 
–డాక్టర్‌ తేజానందన్‌రెడ్డి, కార్డియాలజిస్టు, కర్నూలు 

మరిన్ని వార్తలు