దిశ యాప్‌ మెగా రిజిస్ట్రేషన్‌ డ్రైవ్‌ 

19 May, 2022 18:08 IST|Sakshi

రికార్డు స్థాయిలో లక్ష మందితో డౌన్‌లోడ్‌

అభినందించిన ఎస్పీ విజయారావు

నెల్లూరు (క్రైమ్‌): మహిళల రక్షణకు రూపొందించిన దిశ యాప్‌ మెగా రిజిస్ట్రేషన్‌ డ్రైవ్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు పర్యవేక్షణలో అన్ని పోలీస్‌స్టేషన్లలో పరిధిలో బుధవారం నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా పోలీసు లు బృందాలుగా ఏర్పడి అంగన్‌వాడీ, ఆశ వర్క ర్లు, వలంటీర్ల సహకారంతో మహిళలు, యువతులు, విద్యార్థినులకు యాప్‌పై విస్తృత అవగాహన కల్పించారు.

గంటల వ్యవధిలోనే లక్ష మంది యాప్‌ను డౌన్‌లోడ్‌  చేసుకున్నారు. స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొన్న ప్రముఖులు, మహిళలు, యువత, ప్రజలకు దిశ యాప్‌ పని తీరును వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. 

అందులో భాగంగా దిశ చట్టం, దిశ మొబైల్‌ యాప్‌ను రూపొందించిందన్నారు. దేశంలోని అన్నీ అత్యవసర యాప్‌ల్లో కెల్లా దిశ యాప్‌ అత్యున్నతమైందన్నారు. దిశ యాప్‌ ఉంటే పోలీసులు మీ వెన్నంటే ఉనట్లేన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్‌ రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. ఎవరికి ఏ సమయంలో ఆపద వస్తుందో తెలియదని, నాకేం కాదని అనుకోవడం సరికాదన్నారు. ప్రతి మహిళ, యువతి తమ ఫోన్లలో యాప్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు.

ఆపద సమయంలో ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా, ఫోనును నాలుగైదుసార్లు ఊపినా వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుందని, సిబ్బంది అప్రమత్తమై నిమిషాల్లోనే చేరుకుని రక్షణ చర్యలు చేపడుతారన్నారు.  యాప్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రతి మహిళ ఆపద సమయంలో దానిని ఉపయోగించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. దిశ యాప్‌ విశిష్టతను వివరించిన విద్యార్థినులకు ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు.  స్వర్ణవేదికలో మెగా డ్రైవ్‌లో ఎస్పీ పాల్గొని మహిళలనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్‌ డి. హిమవతి,  ఏఎస్పీ  క్రైమ్స్‌ కె.చౌడేశ్వరి, ఏఆర్‌ ఏఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌బీ డీఎస్పీ కోటారెడ్డి పాల్గొన్నారు.  

నగరంలో..  
నెల్లూరులోని ఆరు పోలీసుస్టేషన్లు, ట్రాఫిక్, సీసీఎస్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో మెగా రిజిస్ట్రేషన్‌ డ్రైవ్‌ జరిగింది. నగర ఇన్‌స్పెక్టర్లు వీరంద్రబాబు, టీవీ సుబ్బారావు, అన్వర్‌బాషా, దశరథరామారావు, కె. నరసింహరావు, కె, రామకృష్ణ, సౌత్, నార్త్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు జి. రామారావు, రాములునాయక్‌  తమ స్టేషన్ల పరిధిలో అవగాహన, రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు