తుది దశకు ‘మెగా ఫుడ్‌పార్కు’

1 Apr, 2022 03:35 IST|Sakshi

ఏప్రిల్‌ 15కల్లా కృష్ణా జిల్లా మల్లవల్లిలో పూర్తి కానున్న పనులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ మౌలిక వసతుల కల్పనసంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఏర్పాటు చేస్తున్న మెగా ఫుడ్‌ పార్కు పనులు తుదిదశకు చేరాయి. ఏప్రిల్‌ 15 కల్లా పనులు పూర్తిచేసి.. మామిడి సీజన్‌ ప్రారంభమయ్యే నాటికి కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికా రులు సన్నాహాలు చేస్తున్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో 100 ఎకరాలను ఫుడ్‌ పార్కుకు కేటాయించారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా మామిడి, బొప్పాయి, జామ వంటి పండ్లతోటలు, టమా టా తదితర కూరగాయలు పెద్ద ఎత్తున సాగు చేస్తుం టారు. దీంతో వివిధ రకాల పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌ కోసం మెగా ఫుడ్‌పార్కులో రూ.86 కోట్లతో 7.48 ఎకరాల్లో కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)ను పూర్తిస్థాయి వసతులతో నిర్మిస్తున్నారు.

ఇందులో 960 టన్నుల సామర్థ్యంతో పండ్లను మగ్గ బెట్టడంతో పాటు గంటకు ఆరు నుంచి పది టన్నుల గుజ్జు, రసాలు తీయొచ్చు. బియ్యం, జొన్నలు వంటి ఆహార పదార్థాలనూ నిల్వ చేసుకునేందుకు వీలుగా 4 వేలటన్నుల సామర్థ్యం గల గిడ్డంగిని నిర్మించారు. పండ్లు, కూరగాయల నిల్వకు కూడా 3 వేల టన్నుల సామర్థ్యంతో శీతల గిడ్డంగి, ప్యాకింగ్‌ యూనిట్లు, ఆహార ఉత్పత్తుల నాణ్యత పరిశీలించేందుకు ఎనలై టికల్‌ ల్యాబ్‌ తదితర అన్ని అధునాతన వసతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ.260 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రెండు మెగా ఫుడ్‌పార్కులు అందుబాటు లోకి వస్తే దాదాపు 6 వేలమందికి ఉపాధి లభిస్తుం దని అంచనా వేస్తున్నారు. పనితీరు, ఇక్కడి సౌకర్యా ల గురించి పెట్టుబడిదారులకు అవగాహన కల్పిం చేందుకు ఏపీఐఐసీ త్వరలో రోడ్‌ షోలు నిర్వహించబోతోంది. నేరుగా ఇక్కడకు సరుకు తీసుకువచ్చిన వారు.. కావాల్సిన విధంగా ప్రాసెస్‌ చేసుకొని, అవసరమైన పరిమాణంలో ప్యాకింగ్‌ చేసి, తీసుకెళ్లే సదుపాయాలు కల్పించినట్లు ఏపీఐఐసీ అధికారులు వివరించారు.

చాలా సంస్థలు వస్తున్నాయ్‌..
ఏప్రిల్‌ 15కల్లా మెగా ఫుడ్‌ పార్కులో పనులు పూర్తి చేసి కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ నడుస్తోంది. ఇప్పటికే ప్రొడక్షన్, మార్కెటింగ్‌కు సంబంధించిన యూనిట్లు నెలకొల్పేందుకు చాలా సంస్థలు ఏపీఐఐసీని సంప్రదించాయి.     
– డి.శ్రీనివాసరావు, జోనల్‌ మేనేజర్, ఏపీఐఐసీ 

మరిన్ని వార్తలు