పేదల కళ్లలో సొంతింటి వెలుగులు : అనిల్‌కుమార్‌యాదవ్‌

5 Jul, 2021 10:10 IST|Sakshi

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట):  ప్రైవేట్‌ లేఅవుట్ల కంటే మిన్నగా అభివృద్ధి చేసిన వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో  లబ్ధిదారులు తమ ఇళ్లకు శంకుస్థాపన చేస్తుంటే వారి కళ్లల్లో సంతోషం, ఆనందం కనిపిస్తోందని, ఏక కాలంలో ఇలా శంకుస్థాపనలు చేయడం పండగ వాతావరణాన్ని తలపిస్తోందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డాక్టర్‌ పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకం కార్యక్రమంలో భాగంగా ఆదివారం నెల్లూరు నగర నియోజకవర్గంలోని పేద ప్రజలకు కొండ్లపూడి వైఎస్సార్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం చరిత్ర అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయంలో భాగంగా తొలి విడతగా 17 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు.

నగర నియోజకవర్గానికి సంబంధించి అర్హులైన దాదాపు 14,500 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అందులో మొదటి విడతగా 7,600 ఇళ్లు మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్‌ వంటి మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి పేదలకు ఇళ్లు నిర్మిస్తూ మంచి ఆశయంతో ముందుకు వెళుతున్నారన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులు ఆరు అంకణాలు మాత్రమేనని ఇచ్చారని, విమర్శిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో పేదలకిచ్చిన టిడ్కో ఇళ్లు కేవలం నాలుగు అంకణాలు మాత్రమేనని గుర్తు చేశారు.

పేదలకు సొంతిల్లు నిర్మించాలనే ఆలోచనతో అందుబాటులో ఉన్న స్థలాలను అభివృద్ధి చేసి ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. పట్టణ పరిధిలో తక్కువ భూమి అందుబాటులో ఉండడంతో వీలైనంత వరకు సేకరించి గత ప్రభుత్వం కంటే ఎంతో గొప్పగా పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇచ్చిన దాఖాలు లేవన్నారు. గతంలో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఇచ్చే క్రమంలో పేదలపై రూ.3 లక్షల భారం మోపారన్నారు.

ఆ రుణాలు కూడా పూర్తిగా మాఫీ చేసి ఉచితంగా ఇళ్లు లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు. పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు అన్ని రకాల వెసులుబాటు కల్పిస్తునామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌), అధికారులు, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. పేద వారికి అండగా ఉండేది జగనన్న ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్, ఆర్డీఓ హుస్సేన్‌సాహెబ్, వైఎస్సార్‌సీపీ నాయకులు కొణిదల సుధీర్, ఎండీ ఖలీల్‌ అహ్మద్, వేలూరు మహేష్, ఇంతియాజ్, గోగుల నాగరాజు, కుంచాల శ్రీనివాసులు, వందవాశి రంగా పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు