25న సీబీఐటీలో మెగా జాబ్‌మేళా 

7 Jun, 2022 17:32 IST|Sakshi

చాపాడు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న స్థానిక చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(సీబీఐటీ)లో 100 ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. సోమవారం సీబీఐటీ కాలేజీలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి జాబ్‌మేళా నిర్వహణకు  స్థల పరిశీలన  చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

ఇప్పటికే గుంటూరు, తిరుపతి, వైజాగ్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జాబ్‌ మేళా నిర్వహించామన్నారు. ఈక్రమంలో జిల్లా ప్రజల కోసం సీబీఐటీలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 11న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మెగాజాబ్‌ మేళా పోస్టర్‌ను ఆవిష్కరిస్తామన్నారు. మేళాలో ఆయా కంపెనీలకు చెందిన 300 మంది హెచ్‌ఆర్‌లు తమ ప్రతినిధులతో పాల్గొని ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల అర్హతలను బట్టి ఉద్యోగ ఎంపిక పడతారన్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకుని డైరెక్ట్‌గా జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  

సీబీఐటీ కరస్పాండెంట్‌ వి.జయచంద్రారెడ్డి, ప్రిన్సిపాల్‌ డా.జి.శ్రీనివాసులరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మండల అధ్యక్షులు తెలిదేల లక్షుమయ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు