ఉచిత విద్యుత్‌ కోసం మెగా సౌర విద్యుత్‌ ప్లాంట్‌

23 Nov, 2020 05:06 IST|Sakshi

విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

సాక్షి, అమరావతి: రాబోయే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంకల్పం మేరకే 10 వేల మెగావాట్ల భారీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు జ్యుడిషియల్‌ ప్రివ్యూ పూర్తి చేసుకుని, టెండర్ల దశకు చేరిందని తెలిపారు. మెగా సోలార్‌ ప్రాజెక్టు పురోగతిని గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వ్యవసాయ విద్యుత్‌పై చేసే సబ్సిడీ 2015–16లో రూ.3,156 కోట్లు ఉంటే, 2020–21 నాటికి ఇది రూ.8,354 కోట్లకు చేరిందని ఇంధన శాఖ పేర్కొంది. ప్రస్తుతం డిస్కమ్‌లు విద్యుత్‌ కొనుగోలుకు యూనిట్‌కు రూ.4.68 చెల్లిస్తున్నాయని, అదే సమయంలో సౌర విద్యుత్‌ ధర రూ.2.43 నుంచి రూ.3.02 వరకు ఉందని తెలిపింది. రాష్ట్రంలో మెగా సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే రానున్న 30 ఏళ్ల కాలంలో రాష్ట్రం రూ.48,800 కోట్లకు పైగా ఆదా చేయవచ్చునని ఏపీజీఈసీఎల్‌ అధికారులు అంచనా వేసినట్టు పేర్కొన్నారు. సౌర విద్యుత్‌ ప్రాజెక్టు యూనిట్లను అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. సాంకేతిక ప్రమాణాల ఆధారంగా సౌర విద్యుత్‌ యూనిట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు