Natural Farming: ఏపీ స్ఫూర్తితో మేఘాలయలో ప్రకృతి సాగు

26 Nov, 2022 12:22 IST|Sakshi

కుదిరిన త్రైపాక్షిక అవగాహన ఒప్పందం 

సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ప్రకృతిసాగు వైపు అడుగులేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇటీవలే మేఘాలయ రాష్ట్ర అధికారులు, గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి గిరిజనులు పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేసింది.

మేఘాలయలో ప్రకృతి వ్యవసాయ పరివర్తన కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించే క్రమంలో మేఘాలయ స్టేట్‌ రూరల్‌ లైవ్లీ హుడ్‌ సొసైటీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుసాధికార సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులకు చెందిన నిట్టపుట్టు పరస్పర సహాయ సహకార సంఘం మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు మేఘాలయలో ప్రకృతిసాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక సహాయం అందించనుంది.

మేఘాలయలో ఘరో, ఖాశీ హిల్స్‌లో ఎంపిక చేసిన ఐదు బ్లాకుల్లో 20గ్రామాల రైతులను ప్రకృతి వ్యవసాయ రైతులుగా తీర్చిదిద్దడంతోపాటు బలమైన కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌ (సీఆర్పీ) వ్యవస్థ రూపకల్పనకు చేయూతనిస్తుంది. ఇందుకోసం 10 మంది సీనియర్‌ కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్ల బృందం మేఘాలయాకు వెళ్లింది. ఈ బృందం అక్కడి కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్లు, ప్రాజెక్టు బృందంతో కలిసి పనిచేస్తుంది. ఎంపికచేసిన బ్లాకుల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రకృతిసాగు చేపట్టడం ద్వారా వాటిని రిసోర్స్‌ బ్లాకులుగా తీర్చిదిద్దనున్నారు.

ఇంగ్లిష్‌ స్థానిక భాషల్లో ప్రకృతిసాగు విధానాలు, పాటించాల్సిన పద్ధతులపై మెటీరియల్‌ తయారుచేసి ఇస్తారు. సిబ్బందికి శిక్షణతోపాటు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రస్థాయిలో కో ఆర్డినేట్‌ చేసేందుకు స్టేట్‌ యాంకర్‌ను నియమిస్తారు. సీజన్ల వారీగా రెండు రాష్ట్రాల కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్లు రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రకృతి వ్యవసాయ అనుభవాలు, ఉత్తమ అభ్యాసాలను పరస్పరం పంచుకోవడానికి కృషిచేస్తారు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం)

మరిన్ని వార్తలు