ఏపీని అగ్రస్థానంలో నిలబెడతాం

18 Jan, 2022 05:25 IST|Sakshi

‘పీఎం గతిశక్తి‘పై దక్షిణాది రాష్ట్రాల సదస్సులో మంత్రి మేకపాటి

సాక్షి, అమరావతి: పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌లో భాగస్వామ్యమై మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సరకు రవాణా, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ వసతుల కల్పన ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణను ఆచరణలో చూపుతున్నారని అన్నారు.

ఇది ఆయన దార్శనికతకు నిదర్శనమన్నారు. పంచ సూత్రాల ద్వారా అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన సోమవారం వర్చువల్‌గా నిర్వహించిన ‘పీఎం గతిశక్తి‘ సదస్సులో మంత్రి మేకపాటి పాల్గొన్నారు. రూ.18 వేల కోట్లతో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నట్లు మేకపాటి తెలిపారు. మూడు పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక నోడ్‌లు, కార్గో హబ్‌ల ద్వారా పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తుందన్నారు. పీఎం గతిశక్తిపై ప్రతి రాష్ట్రం నుంచి నోడల్‌ ఆఫీసర్‌ని నియమించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. 

మరిన్ని వార్తలు