పారిశ్రామిక చేయూతలో ఏపీనే బెస్ట్‌ 

28 Jul, 2020 03:48 IST|Sakshi

సంక్షోభ సమయంలో రూ.1,168 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీ 

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వర్చువల్‌పారిశ్రామిక సదస్సులో మంత్రి మేకపాటి

సాక్షి, అమరావతి: సంక్షోభ సమయంలో రాష్ట్రంలోని పరిశ్రమలకు పూర్తిస్థాయి చేయూతను అందిస్తున్నామని, ఆదాయం పడిపోయిన సమయంలోనూ ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు)లకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటేనని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రకటించారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ‘మేకింగ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఫ్యూచర్‌ పాజిటివ్‌’ అనే అంశంపై సోమవారం ఏర్పాటు చేసిన వర్చువల్‌ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

► కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైన సమయంలోనూ ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవటానికి రూ.1,168 కోట్ల రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటించి, రెండు విడతల్లో చెల్లించాం. 
► ప్రభుత్వ విభాగాలకు కొనుగోలు చేసే 360 రకాల వస్తువుల్లో 25% ఎంఎస్‌ఎంఈల నుంచి కొనుగోలు చేసి 45 రోజుల్లో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. 
► పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కార్మిక శక్తిని అంచనా వేసి ఉపాధి అందించే విధంగా ఒక యాప్‌ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నాం. 
► అవసరమైతే నైపుణ్య శిక్షణను అందించి ఎక్కువ మందికి ఉపాధి కొరతను తీర్చేందుకు ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాం. 
► రాష్ట్రానికి తిరిగి వచ్చిన కార్మికులకు ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టాం. సమావేశంలో  శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ డిప్యూటీ చైర్మన్‌ పీఐ హరనాథ్, రాష్ట్రీయ ఇస్పట్‌ నిగం లిమిటెడ్‌ చైర్మన్‌ ప్రదోశ్‌ కుమార్‌ రత్, ఏపీ విద్యుత్‌ శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, తదితరులు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు