రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల

9 Aug, 2020 13:38 IST|Sakshi

సాక్షి, అమరావతి : 2020-23 పారిశ్రామిక విధానానికి సంబంధించి రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీని పారిశ్రామిక​ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి విడుదల చేయనున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఉ.11 గంటలకు పాలసీ విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్‌ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి.

ఏరోస్పేస్, డిఫెన్స్‌ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా పథకాలు..ఉపాధి కల్పించే పరిశ్రమలను బట్టే ప్రోత్సాహం అందనుంది. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులిచ్చే చర్యలు తీసుకుంటారు. భూముల కేటాయింపు, స్టాంప్ డ్యూటీ, రాష్ట్ర జీఎస్టీ, నాలా ఛార్జీలు, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ అంశాలపై స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేయనున్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడం కోసం 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రెండు స్కిల్ వర్సిటీలు, డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ల సమ్మిళితం కానున్నాయి.
 

మరిన్ని వార్తలు