చేనేత వస్త్రాలకు ‘ఈ–మార్కెటింగ్‌’

8 Aug, 2020 04:48 IST|Sakshi

అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం

నేత నైపుణ్యానికి ప్రభుత్వం అండ

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి   

సాక్షి, అమరావతి: గాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2 నుంచి చేనేత వస్త్రాలకు ‘ఈ–మార్కెటింగ్‌’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. నేత నైపుణ్యానికి పట్టం కట్టించేలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆగస్ట్‌ 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను అందులో మంత్రి వివరించారు. 

► రాయలసీమ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.
► కరోనా కష్టకాలంలో 6 నెలల ముందుగానే రెండవ ఏడాది సాయం అందించాం.
► చేనేత రుమాళ్లను, దుస్తులను విరివిగా కొనుగోలు చేస్తే నేతన్నలను ప్రోత్సహించినట్టే.
► ఇప్పటికే ఆప్కో ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దుస్తులు, దుప్పట్లు అందిస్తోంది.
► అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్‌ వంటి ఈ–కామర్స్‌ సైట్లతో ఒప్పందం చేసుకొని ఆప్కో వస్త్రాలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చాం.
► ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి చీరలు, డ్రస్‌ మెటీరియల్స్, చొక్కాలు, ధోవతులు సహా మొత్తం 104 ఉత్పత్తులు ఆన్‌లైన్‌లోకి తెచ్చాం. చేనేత పరిశ్రమకు భరోసా ఇవ్వడమే కాకుండా, నేతన్న ఆర్థికంగా లాభపడే విధంగా ఉత్పత్తులకు ప్రభుత్వమే సర్టిఫికేషన్, మార్కెటింగ్, బ్రాండింగ్‌ కల్పించనుంది.
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. 13 నెలల కాలంలోనే చేనేతలకు రూ.600 కోట్ల సాయం అందించింది.
► ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ద్వారా దాదాపుగా 81,024 కుటుంబాలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. 

మరిన్ని వార్తలు