పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

6 Mar, 2021 04:32 IST|Sakshi

రెండేళ్లలో ఎంఎస్‌ఎంఈల సంఖ్యను రెట్టింపు చేస్తాం

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని, ఇందులో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతర్జాతీయ మల్టీలేటరల్‌ బ్యాంకులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే విశాఖ–చెన్నై కారిడార్‌ అభివృద్ధికి ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) సాయమందిస్తోందన్నారు. ‘భారీ నిధులతో వ్యాపార అవకాశాలు’ అనే అంశంపై అంతర్జాతీయ మల్టీలేటరల్‌ బ్యాంకులతో కలిసి ఫ్యాప్సీ నిర్వహించిన సదస్సులో మంత్రి మేకపాటి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధి వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని బ్యాంకులు వినియోగించుకోవాలని కోరారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను.. మండల కేంద్రాలకు అనుసంధానించే విధంగా ప్రభుత్వం భారీప్రణాళికను సిద్ధం చేసిందని, ఇప్పటికే న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ రాష్ట్రంలో పలు రహదారుల ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటోందన్నారు. రూ.16 వేల కోట్లతో విశాఖలో చేపడుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లతోపాటు తయారీ, సేవా రంగాల్లో అపార అవకాశాలున్నాయని.. వాటిపై సంస్థలు, బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలన్నారు. కోవిడ్‌ వంటి సమయంలోనూ ఎంఎస్‌ఎంఈల నాలుగేళ్ల బకాయిలు రూ.1,100 కోట్లను తీర్చామన్నారు.

ఈ స్ఫూర్తితో వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల సంఖ్య రెట్టింపు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మల్టీలేటరల్‌ బ్యాంకుల ప్రతినిధులతో వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఫ్యాప్సీ అధ్యక్షులు అచ్యుతరావు, ఫాప్కి సీఈవో ఖ్యాతి నరవనే, వరల్డ్‌ బ్యాంక్, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్, న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు