రాష్ట్ర జీడీపీలో ఎగుమతుల వాటా 12%

22 Sep, 2021 02:44 IST|Sakshi

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఎగుమతుల వాటాను పెంచే విధంగా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీలో ఎగుమతుల వాటా 20% ఉంటే రాష్ట్ర జీడీపీ (జీఎస్‌డీపీ)లో ఇది 12 శాతానికి పరిమితమైందని తెలిపారు. దీన్ని పెంచేందుకు 10 ఏళ్లకాలానికి ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు. వాణిజ్య ఉత్సవ్‌లో భాగంగా మంగళవారం రాష్ట్రంలో ఎగుమతుల అవకాశాలను వెల్లడించేలా ‘స్థానికంగా ఉత్పత్తి– అంతర్జాతీయంగా విక్రయం’ అంశంపై వివిధ దేశాల రాయబార ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 300 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దేశ ఎగుమతులను 2025 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం చేరుకోవాలంటే ఏటా దేశ ఎగుమతుల్లో 36 శాతం వృద్ధి నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు ప్రస్తుత 16.8 బిలియన్‌ డాలర్ల నుంచి 22.4 బిలియన్‌ డాలర్లకు చేరతాయని తెలిపారు. అలాగే 2030 నాటికి రాష్ట్ర ఎగుమతులను రెట్టింపు చేయాలన్న లక్ష్యం చేరుకోవాలంటే ఏటా 8% వృద్ధిని నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. 10 ఏళ్ల కాలానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని రెండు, మూడేళ్లకు ఒకసారి సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు