రాష్ట్రంలో పెట్టుబడులపై అమెజాన్‌తో చర్చలు   

31 Jul, 2020 04:39 IST|Sakshi

స్కిల్‌ డెవలప్‌మెంట్, డిజిటల్‌ గవర్నెన్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి

మంత్రి మేకపాటితో అమెజాన్‌ ప్రతినిధుల సమావేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులపై బహుళజాతి సంస్థ అమెజాన్‌ ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో భాగస్వామ్యం కావడంతో పాటు, డిజిటల్‌ గవర్నెన్స్, రాష్ట్రంలోని చిన్న వ్యాపార సంస్థలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్‌ ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ... 


► టెక్నాలజీలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం అమెజాన్‌తో పాటు ఐఎస్‌బీ వంటి సంస్థల సహకారం తీసుకుంటాం. 
► సహేలి కార్యక్రమం ద్వారా మహిళా సాధికారితే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాధారణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మలచాలన్నది సీఎం స్వప్నం. 
► స్థానికంగా తయారయ్యే వస్తువులకు మార్కెటింగ్, శిక్షణ, ప్రోత్సాహం, అమ్మకం వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం అండగా ఉంటుంది.  
► రాష్ట్రవ్యాప్తంగా త్వరలో రానున్న 30 నైపుణ్య కాలేజీలలో.. ఒకచోట అమెజాన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కు అవకాశమిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తాం. 
► విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్‌ రంగాల్లో విప్లవాత్మక మార్పులలో అమెజాన్‌ తో కలిసి ముందుకు వెళ్లేందుకుగల అవకాశాలపై దృష్టిసారిస్తాం. 
► ప్రస్తుతం మొదటి దశ చర్చలు పూర్తయ్యాయని, త్వ రలోనే పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెజాన్‌ ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ రాహుల్‌ శర్మ, తెలిపారు. ఈ వర్చువల్‌ సమావేశానికి ఐటీ శాఖ కార్యదర్శి భానుప్రకాశ్,  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుందర్, అమెజాన్‌ స్టేట్స్‌ అండ్‌ లోకల్‌ గవర్నమెంట్‌ విభాగాధిపతి అజయ్‌ కౌల్‌ హాజరయ్యారు.

మరిన్ని వార్తలు