ప్రజల సమాచార భద్రతకే మొదటి ప్రాధాన్యత

27 Feb, 2021 03:48 IST|Sakshi

అన్ని ప్రభుత్వ విభాగాల వెబ్‌సైట్లు ఐటీ శాఖ పరిధిలోకి..

ఏప్రిల్‌ 1 నుంచి కొనుగోళ్లన్నీ ఐటీ శాఖ ద్వారా చేయాల్సిందే

ఉద్యోగ కల్పనకు ఐటీ పార్కులు, కాన్సెప్ట్‌ సిటీలు: మంత్రి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ప్రజల సమాచార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాలు వినియోగిస్తున్న ఐటీ అప్లికేషన్లు, వెబ్‌సైట్లను రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని ప్రభుత్వ శాఖల సేవలు, కొనుగోళ్లు ఐటీ శాఖ ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా ఐటీ శాఖ నుంచే ఈ పని మొదలుపెట్టాలని, 48 గంటల్లోగా ఐటీ శాఖ వెబ్‌సైట్‌ను ప్రక్షాళన చేయాలని సూచించారు. శుక్రవారం విజయవాడలో ఐటీ శాఖ పనితీరుపై మంత్రి గౌతమ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత భద్రంగా నిర్వహించాల్సిన ప్రభుత్వ డేటా బాధ్యతలను గత ప్రభుత్వం కన్సల్టెంట్లు, పొరుగు సేవల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందని విమర్శించారు. 

త్వరితగతిన పారిశ్రామిక సర్వే పూర్తి చేయాలి
ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖలో ఐకానిక్‌ ఐటీ టవర్ల నిర్మాణంతోపాటు మూడు చోట్ల ఐటీ కాన్సెప్ట్‌ సిటీల నిర్మాణ పనుల వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కేవలం బీపీవో ఉద్యోగాలు మాత్రమే కాకుండా టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాల కల్పనపై కూడా దృష్టి సారించాలన్నారు. త్వరితగతిన పారిశ్రామిక సర్వే పూర్తి చేయాలని సూచించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ  ఇప్పటివరకు నైపుణ్యాభివృద్ధి సంస్థ జాబ్‌ ఫెయిర్, స్కిల్‌ కనెక్ట్‌ డ్రైవ్‌ కార్యక్రమాల ద్వారా 23,490 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు ఒక్కటి మినహా అన్నిచోట్ల భూసేకరణ పూర్తయ్యిందన్నారు. రాష్ట్రంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలు ఏర్పాటు చేయడానికి 10 సంస్థలు ముందుకొచ్చాయన్నారు. మొత్తం 30 కాలేజీల్లో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు