ఐఎస్‌బీ ఒప్పందం దేశంలోనే తొలిసారి: గౌత‌మ్ రెడ్డి

1 Aug, 2020 16:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్బీ ఒప్పందం కుదుర్చుకుంటున్న‌ట్లు ప‌రిశ్ర‌మల ‌శాఖ‌ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శ‌నివారం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై శ‌నివారం అధికారుల‌తో మంత్రి గౌత‌మ్‌రెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు. ప‌‌రిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐటీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు ఈ భేటిలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి గౌత‌మ్ రెడ్డి మాట్లాడుతూ..  ఆగస్ట్ 5న ఐఎస్బీ ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ జ‌ర‌గ‌నుంద‌న్నారు. ఐఎస్‌బీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో కీలక సమస్యలకూ వెంటనే పరిష్కారం ల‌భించ‌నుంద‌ని తెలిపారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలను తీసుకురావడం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఐఎస్‌బీ కీల‌క‌పాత్ర పోషించ‌నుంద‌ని పేర్కొన్నారు. ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించేందుకు ఐఎస్‌బీ తోడ్పాటు అందించ‌నుంద‌ని తెలిపారు. మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు ఐఎస్బీ సిద్ధంగా ఉంద‌న్నారు.

అక్టోబ‌ర్ క‌ల్లా నైపుణ్య కాలేజీల ఏర్పాటు
అంత‌క‌ముందు నైపుణ్య కాలేజీల‌ ఏర్పాటుపై మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అక్టోబర్లో నైపుణ్య కాలేజీలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలిపారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో ఏ అవకాశాన్ని వదలకూడదన్నారు. ఈ సంద‌ర్భంగా నైపుణ్య శిక్ష‌ణా కేంద్రాల ఏర్పాటుకు రుణాలందించడానికి ఏయే బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ఆరా తీశారు.

దీనికి సంబంధించి బ్యాంకులు ఎంత మొత్తంలో రుణాలందించేందుకు సుముఖంగా ఉన్నాయో ఎండీ అర్జా శ్రీకాంత్ మంత్రికి వివ‌రించారు. ప్రభుత్వ పూచికత్తుతోనే మరిన్ని నిధులు సాధ్యమని నైపుణ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము మంత్రికి వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్కిల్ కాలేజీ ఏర్పాటు అవుతున్నందున స్థానిక ఎంపీల నిధుల నుంచి కొంత సాయం పొందవచ్చని ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. యువత భవిష్యత్ ను మార్చే స్కిల్ కాలేజీల ఏర్పాటులో ప్రతీ రూపాయి అవసరమేనని, ప్ర‌తి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేరాల‌ని గౌత‌మ్‌రెడ్డి తెలిపారు

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్లి మ‌రింత లోతుగా చర్చిద్దామని మంత్రి మేకపాటి అధికారుల‌తో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ హాజర‌య్యారు.

మరిన్ని వార్తలు