రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగింత.. ఉదయగిరికి మరో మణిహారం

27 May, 2022 12:08 IST|Sakshi

మెరిట్స్‌ను అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా.. 

మేకపాటి కుటుంబ దాతృత్వానికి సలామంటున్న ప్రజలు 

యూనివర్సిటీతో మారనున్న వ్యవసాయ స్థితిగతులు

ఉదయగిరికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో రాజులు, శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఇక్కడ స్వర్ణయుగం నడిచినట్లు చెబుతుంటారు. కాలగమనంలో కరువు రాజ్యమేలింది. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి మరో మణిహారం రానుంది. ఎంఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దాతృత్వంతో ప్రజలకు ఉపయోగపడేలా వర్సిటీని తీర్చిదిద్దనున్నారు.  

సాక్షి, నెల్లూరు: మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను అగ్రికల్చర్‌ అండ్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీగా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా వర్సిటీని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థుల్లో మరింత మక్కువ పెంచేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇక్కడి విద్యార్థులు అగ్రికల్చర్‌ కోర్సుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక్కడ వర్సిటీ అందుబాటులో ఉంటే అధిక మంది విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం గుంటూరులో ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ మాత్రమే ఉంది. దాని పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు సుమారు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో ఏర్పాటు కానున్న యూనివర్సిటీకి రాయలసీమ పరిధిలో ఉండే కళాశాలలను అనుసంధానం చేసే అవకాశం ఉంది. 

మేకపాటి కుటుంబం దాతృత్వం 
మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి తప్పక జరుగుతుందనే ఆశయంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే ఎంతో ఉదారంగా సాయం చేశారు. మర్రిపాడు మండలంలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు సొంత భూములు కేటాయించారు. సుమారు 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్‌ చేసేందుకు సొంత నిధులు సమకూర్చారు. ఎంఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలకు సొంత నిధులిచ్చారు. ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేశారు. మేకపాటి కుటుంబం ప్రస్తుతం అగ్రికల్చర్‌ యూనివర్సిటీకి సుమారు రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగించడంతో వారి దాతృత్వానికి మెట్ట ప్రాంత ప్రజలు సలాం చేస్తున్నారు. 

మహర్దశ పట్టించేలా.. 
చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఉదయగిరిలో ఒకప్పుడు వ్యవసాయ రంగానికి సాగునీరు కరువై బతుకు దెరువు కోసం ఎంతోమంది వలస వెళ్లారు. అలా వెళ్లిన వారిలో శ్రీమంతులైన వారు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉదయగిరికి సాగునీరందించే బృహత్తరమైన పథకాలకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవల్‌ కెనాల్‌ లాంటి ప్రాజెక్టులతో ఉదయగిరి వలస జీవనానికి కళ్లెం వేసి మోడుబారిన భూములు పచ్చని పైర్లతో కళకళలాడేలా చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టులు పూర్తయితే వలసవాసులు తిరిగి వచ్చి సాగుబాట పట్టే అవకాశం ఉంది. దీనికితోడు వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుతో ఇక్కడి అన్నదాతలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

ఔన్నత్యానికి నిదర్శనం 
మేకపాటి కుటుంబం ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రూ.250 కోట్లు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి అగ్రికల్చర్‌ యూనివర్సిటీని స్థాపించమని కోరడం వారి ఔన్నత్యానికి నిదర్శనం. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయనుండడం ఆనందదాయకం. 
–  షేక్‌ గాజుల ఫారుఖ్‌అలీ, ఉదయగిరి 

హర్షదాయకం 
ఈ ప్రాంత రైతులకు ప్రయోజగకరంగా ఉంచేందుకు మెరిట్స్‌ కళాశాలను అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం హర్షదాయకం. మెరిట్స్‌ కళాశాల ఉద్యోగులకు అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో కూడా ఉద్యోగ భద్రత కల్పించేలా మేకపాటి రాజమోహన్‌రెడ్డి కృషి చేయడం వారి దూరదృష్టికి నిదర్శనం. 
– డాక్టర్‌ ఎం.మనోజ్‌కుమార్‌రెడ్డి, మెరిట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ 

గౌతమ్‌రెడ్డి పేరుతో.. 
మెరిట్స్‌ కళాశాల 106 ఎకరాల ప్రాంగణంలో ఉంది. ఐదు లక్షల స్క్వేర్‌ ఫీట్‌ సంబంధించిన అకాడమీ బ్లాక్స్, 600 అమ్మాయిలు, 750 అబ్బాయిలుండేలా హాస్టల్‌ భవవ సదుపాయాలున్నాయి. 89 స్టాఫ్‌ క్వార్టర్స్, ఓపెన్‌ ఆడిటోరియం, ఇంజినీరింగ్‌ ల్యాబ్, లైబ్రరీ 27 వేల పుస్తక సముదాయం, మూడు బస్సులు, జనరేటర్స్, క్యాంటీన్, గెస్ట్‌ హౌస్, ఫిజికల్‌ డైరెక్టరీస్, ఎన్‌ఎస్‌ఎస్, భవన సముదాయాలు, ప్లే గ్రౌండ్‌ తదితర ఆస్తులను వ్యవసాయ యూనివర్సిటీ కోసం ప్రభుత్వానికి అప్పగించనున్నారు. అలాగే సుమారు 50 ఎకరాల్లో ప్లాంటేషన్‌ చేసేందుకు అవసరమైన భూములను కూడా ఇటీవల అగ్రికల్చర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. రూ.కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చిన ఎంఆర్‌ఆర్‌ ట్రస్ట్‌ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నిర్మాణం చేయాలని కోరింది. అలాగే ప్రస్తుతం మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలన్న వారి విన్నపానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు