సీఎంను కలిసిన మేకపాటి విక్రమ్‌

29 Apr, 2022 04:18 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌తో విక్రమ్‌రెడ్డి, రాజమోహన్‌రెడ్డి

దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి రాజకీయ వారసుడిగా ప్రజాసేవలోకి 

సీఎం జగన్‌ ఆశీస్సుల కోసం విక్రమ్‌ని తీసుకొచ్చా: రాజమోహన్‌రెడ్డి

త్వరలో నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధం

సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డి ప్రజాసేవలో పాలు పంచుకోనున్నారు. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన రెండో కుమారుడు విక్రమ్‌రెడ్డితో కలసి గురువారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. నియోజకవర్గ పర్యటనకు ముందుగా ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకునేందుకు విక్రమ్‌రెడ్డి వచ్చినట్లు రాజమోహన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే విక్రమ్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు చెప్పారు. క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌ను కలసినట్లు తెలిపారు. విక్రమ్‌ ప్రజాసేవలో నిమగ్నం కానున్నట్లు రెండు వారాల క్రితమే సీఎం జగన్‌కు తెలియజేశామన్నారు. ఉప ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాతే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారో తెలుస్తుందన్నారు. పోటీ పెట్టాలా? వద్దా? అనేది ఆయా పార్టీల ఇష్టమన్నారు. తొలుత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 

జగనన్న నాకు ఆదర్శం: మేకపాటి విక్రమ్‌రెడ్డి  
ఇన్నాళ్లూ వ్యాపార రంగంలో నిమగ్నమైన తాను రాజకీయాల్లోకి ప్రవేశించి సోదరుడు గౌతమ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి గౌతమ్‌రెడ్డి చేయాలనుకున్నది చేసి చూపిస్తానన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబం ఆశీస్సులు తీసుకుంటానన్నారు. జగనన్న ఆదేశాల మేరకు నడుచుకుంటూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తానని చెప్పారు. రాజకీయాల్లో తనకు ఆయనే రోల్‌ మోడల్‌ అని పేర్కొన్నారు. గడపగడపకూ వైఎస్సార్‌ సీపీ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ప్రారంభించి సీఎం జగన్‌ ఆదేశించినట్లుగా సచివాలయాలను సందర్శించనున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు