సాయుధ దళాల సేవలు అనిర్వచనీయం

8 Dec, 2021 03:37 IST|Sakshi
అమర జవానుల కుటుంబ సభ్యులతో హోం మంత్రి సుచరిత

సైనిక సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

సాయుధ దళాల పతాక దినోత్సవంలో హోం మంత్రి మేకతోటి సుచరిత

సాక్షి, అమరావతి: శత్రుమూకల నుంచి దేశాన్ని నిరంతరం రక్షిస్తూ ప్రజలు సుఖశాంతులతో జీవించేందుకు సాయుధ దళాలు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కొనియాడారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సాయుధ దళాల పతాక దినోత్సవం–2021 నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సైనికులు, మాజీ సైనికులకు, వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయుధ దళాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

గతంలో వీర మరణం చెందిన సైనిక కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తే, తమ ప్రభుత్వం రూ.50 లక్షలు అందజేస్తోందన్నారు. ఇళ్ల పట్టాలతో పాటు కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సైనికుల ఇళ్ల స్థలాల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. ఇప్పటివరకు 140 మందికి 300 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలను అందజేసినట్టు చెప్పారు. 

ఆర్థిక సాయం అందజేత
దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో అసువులు బాసిన ప్రకాశం జిల్లాకు చెందిన అమర జవాను హవల్దార్‌ గుర్రాల చంద్రశేఖర్‌ సతీమణి మేరీ మంజుల, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాల కృష్ణసురపతి భార్య దీపా, విజయనగరం జిల్లాకు చెందిన వీర సైనికుడు నాయక్‌ పాండ్రంకి చంద్రరావు సతీమణి సుధారాణి, కర్నూలు జిల్లాకు చెందిన సైనికుడు పొలుకనటి శివగంగాధర్‌ భార్య రాధిక,  గుంటూరు జిల్లాకు చెందిన సైనికుడు  ఎం.జస్వంత్‌ కుమార్‌రెడ్డి భార్య వెంకటేశ్వరమ్మకు సైనిక సంక్షేమ ప్రత్యేక నిధి నుంచి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని హోం మంత్రి అందజేశారు.

164 సార్లు రక్తదానం చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ సైనికుడు సార్జెంట్‌ బొడ్డేపల్లి రామకృష్ణారావును సత్కరించారు. గత ఏడాది పతాక దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున విరాళాలను సేకరించిన తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి  కెప్టెన్‌ డాక్టర్‌ పి.సత్యప్రసాద్‌ (రిటైర్డ్‌), కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి పి.రాచయ్య, పశ్చిమ గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి  కేవీఎస్‌ ప్రసాదరావుకు మంత్రి ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్,  సైనిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు  వీవీ రాజారావు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు