తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించం

26 Sep, 2020 04:48 IST|Sakshi
ఓపెన్‌ టాప్‌ జీపులో గౌరవ వందనం స్వీకరిస్తున్న హోంమంత్రి మేకతోటి సుచరిత, చిత్రంలో డీజీపీ గౌతం సవాంగ్‌

ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో హోం మంత్రి మేకతోటి సుచరిత 

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం అనంతపురం పీటీసీ మైదానంలో నిర్వహించిన స్టైఫండరీ కేడెట్‌ ట్రైనీ ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. 

► మా పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఉపేక్షించవద్దని సీఎం వైఎస్‌ జగన్‌ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలాగే, తప్పు చేసిన పోలీసు అధికారులపైనా కేసులు నమోదు చేయిస్తున్నాం. 
► ‘స్పందన’ ద్వారా 87వేల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వీటిలో 80% వరకు పరిష్కరించాం. 
► కొత్తగా తిరుపతి, అమరావతి, విశాఖ ప్రాంతాల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. 
► 87 పోలీస్‌ సేవలను ఏపీ పోలీస్‌ సేవ యాప్‌ ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. దిశ యాప్‌ను 11 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నారు. 

అట్టహాసంగా పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ 
అనంతపురం పీటీసీ మైదానంలో 2019–20 ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న 273 మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలు పరేడ్‌ నిర్వహించి హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌లకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. 2019–20 బ్యాచ్‌లో మొత్తం 273 మంది ఎస్‌ఐలుగా శిక్షణ పూర్తి చేయగా, ఇందులో సివిల్‌ 138 మంది, ఏఆర్‌ 69 మంది, ఏపీఎస్‌పీ ఎస్‌ఐలు 66 మంది ఉన్నారు. అన్ని విభాగాల్లో కలిపి ఈసారి 55 మంది మహిళా ఎస్‌ఐలు ఉండటం గమనార్హం. కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు